-
-
By Chowdary
Updated :
20 November 2025 06:33 PM
వ్యాపారం చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఏ వ్యాపారం చేయాలి? ఎందులో లాభాలు ఎక్కువగా వస్తాయి? అన్న విషయాల్లో కొంతమందికి స్పష్టత ఉండదు. మహారాష్ట్రకు చెందిన రోహిణీ పాటిల్ కూడా ఒక దశలో ఇదే డైలమాలో పడిపోయింది. అంతలోనే ఓ వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన ఆమె కంట పడింది. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తికి సంబంధించిన యాడ్ అది. అనుకున్నదే తడవుగా ఇందులో నైపుణ్యాలు నేర్చుకొని సొంతంగా ఓ వ్యాపారం ప్రారంభించడమే కాదు.. ప్రస్తుతం ఏడాదికి పాతిక లక్షల ఆదాయం ఆర్జిస్తోంది. తన చుట్టూ ఉన్న వారికీ ఇందులో శిక్షణ ఇస్తూ వారినీ ఉపాధి దిశగా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం తేనె ఎగుమతిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిణి వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం రండి..
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం 1.07 లక్షల మెట్రిక్ టన్నుల తేనెను ఇతర దేశాలకు ఎగుమతి చేసి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తేనె ఎగుమతిదారుగా నిలిచింది. తద్వారా సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే దూకుడుతో ముందుకు సాగితే 2033 కల్లా మన తేనె మార్కెట్ దాదాపు రూ. 68 వేల కోట్లు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఔషధ గుణాలున్న సహజసిద్ధమైన తేనె ఉత్పత్తిని వ్యాపార మార్గంగా మార్చుకొని రోహిణి సైతం లాభాలు ఆర్జిస్తోంది.