-
-
By Chowdary
Updated :
20 November 2025 06:29 PM
అదో ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షో.. కొన్ని వందల మంది మోడల్స్ క్యాట్‌వాక్ చూస్తున్నారు. అంతలోనే వయ్యారంగా నడుస్తూ వచ్చిందో మోడల్. మెట్లు దిగే క్రమంలో అనుకోకుండా జారిపడింది. ఇలాంటి పరిస్థితిలో ఎవరున్నా భయం, బెరుకు కనిపిస్తాయి.. అడుగు ముందుకు పడదు. కానీ అక్కడేమీ జరగనట్లుగా తెలివిగా పోజిచ్చి, నిండైన ఆత్మవిశ్వాసంతో తిరిగి లేచి క్యాట్‌వాక్ చేసింది లై మై హోవా అనే మోడల్. ఇలా ఆమె సమయస్ఫూర్తికి అక్కడి న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులు చప్పట్ల వర్షం కురిపించారు. పలువురు హాలీవుడ్ ప్రముఖులూ హోవాను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. తన క్యాట్వాక్తోనే కాదు.. సమయస్ఫూర్తితోనూ ఎంతోమంది మనసు దోచుకున్న ఈ సూపర్ మోడల్ హంస నడక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
దేశ, విదేశాల్లో జరిగే ఫ్యాషన్ వీక్స్, ఫ్యాషన్ షోలలో పాల్గొనే మోడల్స్ క్యాట్వాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. అయితే హైహీల్స్ ధరించి ఆయా మోడ్రన్ దుస్తుల్లో నడవాలంటే మాటలు కాదు.. ఇందుకోసం కొన్ని రోజుల ముందు నుంచే రిహార్సల్స్ చేస్తుంటారు. ఇలా సాధన చేసినప్పటికీ కొంతమంది స్టేజి మీద నడవలేక ఇబ్బంది పడడం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే తనకెదురైనప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి మన్ననలు అందుకుంది వియత్నాంకు చెందిన 20 ఏళ్ల మోడల్ హోవా.