-
-
By Chowdary
Updated :
20 November 2025 06:32 PM
ఆమె ఫార్మసీ రంగంలో రాణించాలనుకున్నారు... కానీ, ఆర్థిక పరిస్థితులు... వెటర్నరీ వైపు నడిపించాయి. అయితేనేం, అందులోనూ అద్భుతాలు చేస్తున్నారు. ముఖ్యంగా పశువులకు కృత్రిమ గర్భధారణ పద్ధతులను చురుగ్గా అమలు చేస్తున్నందుకే నంద్యాల జిల్లా చింతకుంట జూనియర్ వెటర్నరీ అధికారిణి అనురాధను ‘జాతీయ గోపాలరత్న అవార్డు’ వరించింది. ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది.
నా స్వస్థలం నంద్యాల. నాన్న సుబ్బరాయుడు రజక వృత్తి చేస్తూ నన్ను చదివించారు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఇంటర్ బైపీసీ గ్రూపు తీసుకుని 75శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. తరవాత ఫార్మసీ కోర్సులో చేరాను. ఈ రంగంలో రాణించాలనేది నా లక్ష్యం. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి. దీంతో ఫార్మసీని వదిలి ఆ పరీక్షకు సన్నద్ధమవ్వడం మొదలుపెట్టా. 2004వ సంవత్సరంలో నిర్వహించిన ఈ పరీక్ష కోసం 350 మంది పోటీపడ్డారు. ఎంపికైన ఆరుగురిలో నేనొకదాన్ని. శిక్షణ అనంతరం 2006లో బండి ఆత్మకూరులో తొలి పోస్టింగు. 2013లో లైవ్ స్టాక్ అసిస్టెంట్‌గా, 2019లో జూనియర్ పశువైద్య అధికారిణిగా పదోన్నతి పొందాను. తర్వాత కొన్నాళ్లు గోపవరంలో విధులు నిర్వర్తించా. ఆ సమయంలోనే దేశంలో పశుసంపదను పెంచడానికి కేంద్రం ‘సెక్స్ సోర్టిడ్ సెమెన్ కృత్రిమ గర్భధారణ’ (ట్రిపుల్ ఎస్ ఏఐ) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది పాడి రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందనే ఆలోచనతో పశువులకు పెద్ద ఎత్తున కృత్రిమ గర్భధారణలు చేయించా. దీనివల్ల 2024-25వ సంవత్సరంలో 345 వరకు మేలుజాతి పెయ్య దూడలు జన్మించాయి. ఆ కృషికే ‘జాతీయ గోపాలరత్న అవార్డు’కు ఎంపికయ్యా. దేశం మొత్తమ్మీద అన్ని కేటగిరీలకు కలిపి మొత్తం 2,081 మంది పోటీపడగా మూడు కేటగిరీల్లో కేవలం 9మందికి అవార్డులను ఇవ్వనున్నారు. వారిలో నేను జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచా. ఈ నెల 26వ తేదీన అవార్డుని అందుకోనున్నా.