-
-
By Chowdary
Updated :
20 November 2025 06:29 PM
గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే పదే గుర్తొస్తున్నాయా? మీపై మీకున్న నమ్మకం కోల్పోయి ప్రతికూల ఆలోచనలు మీ మనసును తొలిచేస్తున్నాయా? వీటితో పాటు అలసట, నీరసం.. వంటివీ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అయినా కాస్త ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి సమస్యలు సహజమేనంటూ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అదిగో అలాంటి అలక్ష్యమే తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీన్నే మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న స్థితి (మెంటల్ బ్రేక్డౌన్ లేదా నెర్వస్ బ్రేక్డౌన్)గా పేర్కొంటున్నారు. సరైన సమయంలో దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే మానసిక ఆరోగ్యం మరింత దిగజారే ప్రమాదం ఉందంటున్నారు.
శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చురుగ్గా చేసుకోగలం. అదే ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే.. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవడమే కాదు.. ఏ పని పైనా ఏకాగ్రత పెట్టలేం. అందుకే ఇలాంటి మానసిక సమస్యను ఆదిలోనే గుర్తించాలంటున్నారు నిపుణులు. అయితే చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంతో పాటు సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారని.. తద్వారా అది క్రమంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే స్థితి (మెంటల్ బ్రేక్డౌన్)గా పరిణమిస్తుందని అంటున్నారు.