-
-
By Chowdary
Updated :
21 November 2025 09:47 AM
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: కోటి దీపాల కాంతులతో కృష్ణా గోదారమ్మ సంగమం ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకొంది. వేలాది మంది భక్తుల శివనామం స్మరణతో మార్మోగింది. కార్తిక మాసం ముగింపు సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం కొండపల్లి పురపాలక సంఘ పరిధిలోని పవిత్ర సంగమం వద్ద గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త దివి నరసింహదీక్షిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సంకీర్తనలు, లలిత సహస్రనామ పారాయణం, లింగాష్టకం, భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘ ఛైర్మన్ చిట్టిబాబు దంపతులు, కమిషనర్ రమ్యకీర్తన, కౌన్సిలర్లు జ్యోతి వెలిగించారు. అర్చకుల పిలుపు మేరకు దీపోత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వీక్షించారు. అనంతరం ప్రవచనకర్తను సన్మానించారు
పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన కోటి దీపోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వంలో సంగమం ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. తిరిగి ఆ వైభవాన్ని తీసుకొచ్చేందుకు జలహారతి కార్యక్రమాన్ని రెండు నెలల్లో ప్రారంభించేందుకు కృషి చేస్తామని చెప్పారు.