-
-
By Chowdary
Updated :
20 November 2025 06:31 PM
అదో చిన్న గ్రామం. ఉపాధి కోసం ఇంటి యజమానులు వలసలు వెళితే... చుట్టుపక్కల గ్రామాల్లో కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు మహిళలు. కొవిడ్ మహమ్మారి వాళ్ల జీవితాల్ని కుదిపేసింది. దాంతో పొట్ట నింపుకోవడానికి వాళ్లు అనుసరించిన మార్గం చెరువుల పునరుద్ధరణకు కారణమైంది. వీళ్ల గురించి తెలియాలంటే...
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలోని కట్టు బావ పల్లివాసల్ గ్రామం ఈ మహిళలది. 200 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి ఇక్కడ. వీళ్లలో 52 కుటుంబాలకు చెందిన పురుషులు కొవిడ్ మహమ్మారికి బలయ్యారు. కుటుంబ పోషణ భారం మహిళలమీద పడింది. కరోనా వల్ల ఉపాధి అవకాశాలూ తగ్గిపోయాయి. దాంతో వ్యవసాయాన్ని ఆసరాగా చేసుకున్నారు ఆ వితంతువులు. వరి పండించడం మొదలుపెట్టారు. కానీ నీటి కొరతతో ఇబ్బందులు పడేవారు. వీళ్లుండే గ్రామానికి పక్కనే ఓ మసీదు ఉంది. అదో చారిత్రక కట్టడం. దాని ఆధ్వర్యంలో సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అది తెలుసుకుని అక్కడికి వెళ్లారీ మహిళలు. వాళ్లు దిల్లీలో ఉన్న ‘ప్రదాన్’ అనే సంస్థను సంప్రదించి విషయం చెప్పారట. గ్రామీణ, వెనకబడిన మహిళలకు అవసరమైన చేయూతను ఇస్తుందీ సంస్థ. ‘మేము పెద్దలకి సమస్య చెప్పినప్పుడు వాళ్లు సహాయం చేయడానికి అంగీకరించారు. బావులు, ఆనకట్ట కట్టే అవకాశం ఉందేమో వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే స్థానికంగా వినియోగానికి నోచుకోని, నిర్వహణ కరవై ఎండిపోయిన రెండు చెరువులు కనిపించాయి. వాటిని పునరుద్ధరించాలని అనుకున్నాం. ఇదే విషయాన్ని అధికారులకి చెప్పాం. వాళ్లూ మేమూ కలిసి పనులు మొదలుపెట్టాం’ అంటారు మహిళలు.