-
-
By Chowdary
Updated :
20 November 2025 06:28 PM
ఓ చిన్న మెసేజ్, మాట, తగాదా చాలు ఆలోచనలు చుట్టుముట్టడానికి. పర్యవసానాల్ని అతిగా ఊహించుకుంటూ... ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో? తోటివాళ్ల ముందు చిన్నబోయానే! అన్న సందేహాలతో మొదలై... ఎక్కడి విషయం ఎక్కడికో వెళ్లిపోతుంది. అతిగా ఆలోచించడం... ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం అమ్మాయిలూ, మహిళలకూ సర్వసాధారణం. మనం ఎంత కాదనుకున్నా అంగీకరించాల్సిన నిజం ఇది. సమస్య ఎదురైనప్పుడు మెదడులో లాజికల్ భాగం పనిచేయకపోవడమే ఇందుకు కారణం. అలా అని సరిపెట్టుకుందాం, సర్దుకుపోదాం అనుకుంటున్నారేమో... దీనివల్ల సమస్యలూ బోలెడు. అందుకే దీనికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాల్సిందే అంటున్నారు నిపుణులు. అందుకు ఉపయోగపడేదే ఈ 5-5-5 సూత్రం. ఆలోచనలు విసిగిస్తున్నప్పుడు ఒక్కసారి ఆగి... రాబోయే 5 నిమిషాల్లో వీటివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఆలోచించమంటున్నారు నిపుణులు. లేదా 5 నెలలు, ఆ తరవాత 5 సంవత్సరాలకైనా ఇవి నా జీవనశైలిని ప్రభావితం చేస్తాయా అన్న దిశగా తర్కించమంటున్నారు. సమయంతో సమస్యల్ని ముడిపెడతాం కాబట్టి... తెలియకుండానే మెదడులోని లాజికల్ భాగం పనిచేయడం మొదలవుతుందట. పైగా, మనం ఆలోచించే వాటిలో 70శాతం ఆ క్షణానికి అప్రస్తుతమైనవే. కాబట్టి మొదటి 5 నిమిషాల దగ్గరే ఆలోచనలకు గండి పడుతుంది అంటున్నారు నిపుణులు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి మరి!