-
-
By Chowdary
Updated :
21 November 2025 02:28 PM
వరంగల్ వ్యవసాయం, న్యూస్టుడే: నవంబరులోనే చలి పంజా విసురుతోంది. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పదేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలో పడిపోలేదని అధికారులు చెబుతున్నారు. వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలో సాధారణంగా డిసెంబరు నెలాఖరు, జనవరి ఆరంభంలో కొద్దిరోజులపాటు 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే గత పది రోజుల నుంచి ఉదయం దట్టమైన మంచు కురుస్తోంది. దీంతో ఏటూ వెళ్లలేక ముసుగు కప్పి ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఉదయం 7 గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించని పరిస్థితి. 9 గంటల వరకు కూడా చలి ప్రభావం ఉంటోంది. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలుకావడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు, రాత్రింబవళ్లు స్వెట్టర్లతోనే ఉంటున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు సైతం స్వెట్టర్లను ధరించడం లేదా వెంట ఉంచుకుని పోతున్నారు. వారం రోజుల కిందట ఉమ్మడి జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 19.0 డిగ్రీలు ఉండగా, 15వ తేదీ నుంచి తగ్గుతూ వస్తున్నాయి. గురువారం వరంగల్ నగరంలో ఉదయం ఉష్ణోగ్రతలు 10.0 డిగ్రీలుగా నమోదైంది.