-
-
By Chowdary
Updated :
21 November 2025 09:46 AM
అమరావతి: పశ్చిమ బైపాస్ ప్యాకేజీ-3కి మార్గం సుగమమైంది. హైదరాబాద్-విశాఖ మధ్య రాకపోకలు సాగించే వారికి విజయవాడ ట్రాఫిక్ చెర నుంచి విముక్తి దొరికింది. ఎంచక్కా పశ్చిమ బైపాస్‌పై దూసుకెళ్లేందుకు గురువారం సాయంత్రం నుంచి దారులు తెరుచుకున్నాయి. ప్రయాణానికి ప్రతిబంధకంగా ఉన్న నున్న విద్యుత్తు టవర్ల సమస్యకు అధికారులు పరిష్కారం చూపించారు. దీంతో హైదరాబాద్ ప్రయాణికులకు బోలెడంత సమయం ఆదా కానుంది.
తాత్కాలిక టవర్ నిర్మాణంతో...: ప్యాకేజీ-3లో చినఆవుటపల్లి-గొల్లపూడి వరకు 30 కిమీ మేర బైపాస్ పూర్తి చేశారు. జక్కంపూడి, నున్నలో రహదారిపై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్తు టవర్లతో ఇప్పటి వరకు ప్రయాణికులను అనుమతించలేదు. ఇటీవల జక్కంపూడి టవర్ల వివాదానికి కోర్టు పరిష్కారం చూపింది. ప్రస్తుతం ఉన్న ఎలైన్మెంట్లోనే విద్యుత్తు వైర్లను ఎత్తు పెంచాలని తీర్పు ఇచ్చింది. నున్న టవర్ల విషయంలో ఇప్పటికే కొత్త టవర్ల నిర్మాణం సగానికి పైగా పూర్తవడంతో జక్కంపూడి తరహా మార్పు సాధ్యం కాదని అధికారులు భావించారు. దీనికి ఎన్హెచ్ఏఐ అధికారులు యుద్ధప్రాతికన రహదారిపై తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను పైకిలేపి నున్నలో ఓ తాత్కాలిక టవర్ నిర్మించి సమస్యను పరిష్కరించారు.