-
-
By Chowdary
Updated :
20 November 2025 06:31 PM
‘షోలే’ సినిమా తలచుకోగానే.. ‘యే దోస్తీ హమ్ నహీ థోడేంగే’ అనే పాట గుర్తొస్తుంది. అప్పట్లో ఓ ఊపు ఊపేసిన ఈ పాటలో వాడిన బైక్నీ మనం మర్చిపోలేం. సైడ్ కార్ అనుసంధానమైన బైక్‌ని నడుపుతూ, లాంగ్ రైడ్‌ని ఎంజాయ్ చేస్తూ హీరోలిద్దరూ తమ ఫ్రెండ్షిప్ను చాటుకుంటారు. అయితే అహ్మదాబాద్‌కు చెందిన ఈ అక్కచెల్లెళ్లిద్దరూ ఇదే స్టైల్లో తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు. ‘షోలే’ తరహాలో స్కూటర్ రైడింగ్ చేస్తూ అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఎనభై ఏళ్లు దాటినా పడుచు పిల్లల్లా ఈ వింటేజ్ స్కూటర్‌పై దూసుకుపోతున్నారు. మరి, ‘ఈ వయసులోనూ ఎందుకిలా?’ అని అడిగితే.. ద్విచక్ర వాహనాలు నడపడంలో తమకున్న మక్కువే అని చెబుతున్నారు అక్క మందాకినీ షా. తన చెల్లితో తనకున్న అనుబంధాన్ని, స్కూటర్ రైడింగ్ అనుభవాల్ని రంగరిస్తూ ఇటీవలే ఓ సోషల్ మీడియా బ్లాగ్‌తో ఆమె పంచుకున్న విశేషాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సూపర్ దాదీస్ షోలే స్టైల్ స్కూటర్ రైడింగ్ వీడియోలు సైతం ట్రెండింగ్‌లో నిలిచాయి.
వయసు తమ శరీరానికే కానీ.. తమ ఆలోచనలకు, అభిరుచులకు కాదని నిరూపిస్తున్నారు ఈ కాలం బామ్మలు. మనసుకు నచ్చిన పనులు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన మందాకినీ షా, ఆమె చెల్లెలు ఉష ఇదే కోవకు చెందుతారు. సాహసాలు, బైక్ రైడింగ్‌పై ఆసక్తి కనబరిచే వీరు.. ప్రస్తుతం 80 దాటినా చెట్టపట్టాలేసుకొని సిటీ మొత్తం తమ వింటేజ్ స్కూటర్‌పై కలియదిరుగుతారు. ఇలా వీళ్లిద్దరిని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కొందరు వీరి స్కూటర్ రైడ్‌ని తమ కెమెరాలో బంధిస్తుంటారు.