-
-
By Chowdary
Updated :
20 November 2025 06:26 PM
ఇద్దరు అక్కాచెల్లెళ్లు! చెట్టాపట్టాలేసుకుని బండి మీద ఊరంతా తిరుగుతోంటే... చూపులన్నీ వాళ్ల చుట్టూనే! వాళ్ల వయసు 80కి పైమాటే! తిరిగేదేమో సైడ్‌కార్ ఉన్న బండిమీద మరి. అంతేనా... అమ్మాయిల్లో స్ఫూర్తినీ నింపుతున్నారు.
‘ఫలానా చోట పానీపూరీ బాగుంటుందట...’ అని అక్క అనడం ఆలస్యం... ‘వెళ్లి రుచి చూసొద్దామా?’ అనేస్తారు చెల్లి. ఇంకేం ఇద్దరూ కలిసి బండి మీద చక్కా వెళ్లిపోతారు. అక్క పేరు మందాకినీ షా, 87 ఏళ్లు. చెల్లెలేమో ఉష. వీళ్లది అహ్మదాబాద్. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. అయిదుగురు అమ్మాయిలు, ఒకబ్బాయి. వీళ్లని పోషించడానికి తల్లి కూడా కష్టపడక తప్పని పరిస్థితి. అమ్మ కష్టం చూశాకే ప్రతి అమ్మాయీ తన కాళ్ల మీద తను నిలబడటం ఎంత ముఖ్యమో అర్థమైంది అంటారు మందాకిని. పదహారేళ్లప్పుడు మాంటిస్సోరీలో టీచర్‌గా చేరారామె. తరవాత సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్టుల్లో భాగమై... మహిళా మండళ్లతో కలిసి పనిచేయడం, గ్రామీణ మహిళలకు వాళ్ల హక్కుల గురించి చెప్పడం, ఉపాధి మార్గాలు చూపడం వంటివి చేసేవారు. దీనికోసం మోపెడ్, జీప్ వంటివి నడపడం నేర్చుకున్నారు. స్కూటీ కొనుక్కున్నాక దానికి సైడ్ కార్ ఏర్పాటు చేయించుకుని చెల్లెలితో ఇలా నచ్చిన చోటుకు వెళుతున్నారు.