-
-
By Chowdary
Updated :
20 November 2025 06:24 PM
బాలీవుడ్ నటిగానే కాదు... వ్యాపారవేత్తగానూ పేరు తెచ్చుకున్నారు సన్నీ లియోని. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమెను ‘మీ పిల్లల్ని కుటుంబ వ్యాపారంలో ప్రోత్సహిస్తారా?’ అని అడిగారట. దానికామె ‘తప్పకుండా! అయితే ఇదే చేయాలని మాత్రం నిర్దేశించను. వాళ్లు ఏది చేయాలనుకుంటే దానిలో ప్రోత్సహిస్తా’నని సమాధానమిచ్చారు. తాజాగా తన కూతురు నిషా కౌర్ బీబర్‌కి ఓ ఆలోచన వచ్చింది. సాధారణంగా టిష్యూ పేపర్ని ఉపయోగించాక చెత్తబుట్ట కోసం వెతకడం, దొరకనప్పుడు చేతిలోనో బ్యాగులోనో పెట్టుకుని బయట పడేయడం గమనించిందట ఆ తొమ్మిదేళ్ల అమ్మాయి. టిష్యూ బాక్సుకే డస్ట్‌బిన్ జత అయ్యి ఉంటే రోడ్లమీదకు ఇలా చెత్త చేరదు కదా అందట. తన ఆలోచనకే రూపమిచ్చి చెత్తబుట్ట కూడా అంతర్లీనంగా ఉండేలా తనతోనే టిష్యూ బాక్సుని డిజైన్ చేయించారట సన్నీ. ‘బూ బాక్స్’ పేరుతో దాన్ని మార్కెట్లోకీ తీసుకొచ్చారు. అలా కూతురి ఆలోచనని చిన్న స్టార్టప్‌గా తీసుకురావడమే కాదు... సంస్థ సోషల్‌మీడియా హ్యాండిల్నీ స్వయంగా నిర్వహిస్తున్నారు. బూ బాక్స్‌ని తన ‘స్టార్ స్టక్’ వెబ్సైట్లో అందుబాటులో కూడా ఉంచారు. ‘పిల్లల చదువు పూర్తవ్వాలి, ఆ తరవాతే కెరియర్ నిర్మించుకోవాలన్న తీరుకు భిన్నంగా... ఆలోచనేదైనా ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేయగలుగుతా’రంటున్న సన్నీ ఆలోచనని అభినందించాల్సిందే కదూ!