-
-
By Chowdary
Updated :
20 November 2025 06:24 PM
సైన్యంలో పనిచేయడమే ఓ సాహసం. అయితే ఆమె దానికే పరిమితం కాలేదు. మరిన్ని సవాళ్లను ఛేదించాలనుకున్నారు. అందులో భాగంగానే తాజాగా ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయథ్లాన్ ప్రయత్నించారు. ప్రతిష్ఠాత్మక ఐరన్‌మ్యాన్ పతకాన్నీ సాధించారు... లెఫ్టినెంట్ కల్నల్ ఫరా దీబా.
పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి సవాళ్లైనా దాటొచ్చు అంటారు ఫరా. భారత సైన్యానికి చెందిన ఈ లెఫ్టినెంట్ కల్నల్... అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బోటనీలో ఎంఎస్సీ, దూరవిద్య ద్వారా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం యూపీ గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈమెది ప్రయాగ్‌రాజ్. సాహసాలంటే ఇష్టం. మారథాన్లలోనూ పాల్గొంటుంటారు. తాజాగా గోవాలోని మిరామర్ బీచ్‌లో నిర్వహించిన ఐరన్‌మ్యాన్ 70.3 పోటీలో పాల్గొన్నారు. దీన్ని సహనం, దృఢత్వానికి పరీక్షగా చెబుతారు. ఈ పోటీలో మూడు విభాగాలుంటాయి. 1.9 కి.మీ. ఈత, 90కి.మీ. సైక్లింగ్, చివరగా 21.1 కి.మీ. పరుగు... ఎక్కడా విరామం అనేదే ఉండదు. దేశ, విదేశాల నుంచి 1300 మంది పాల్గొన్నారు. ఈ మొత్తాన్నీ 8 గంటల్లో పూర్తిచేశారు ఫరా. అంతేకాదు, ఐరన్‌మ్యాన్ టైటిల్‌నీ అందుకున్నారు.
‘సముద్ర జలాల్లో ఈత, కొండ ప్రాంతాల్లో సైక్లింగ్ ఎండ వేడిలో పరుగు... అంత సులువేమీ కాదు. వేసిన ప్రతి అడుగూ నా సహనానికీ, ప్యాషన్కీ చిహ్నాలే. ఎందుకంటే ఇక నా వల్ల కాదు అని చాలాసార్లే అనిపించింది. ప్రతిసారీ నేను చేయగలను అంటూ నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగా. అందుకే ఫినిష్ లైన్ దాటాక నన్ను నేను భుజం తట్టుకున్నా. ఇది నాకు మర్చిపోలేని అనుభవం’ అనే ఫరా ప్రతి మహిళా దేన్నైనా సాధించొచ్చు అంటారు. ‘కెరియర్లో సాగుతున్నా... ఏదో ఒక క్రీడని తప్పకుండా జీవితంలో భాగం చేసుకోండి. ఇది మీ శరీరాన్నే కాదు... మనసునీ ఆరోగ్యంగా ఉంచుతుంద’న్న సలహానీ ఇస్తున్న కల్నల్ ఫరా... ఈ తరానికి స్ఫూర్తిదాయకమే కదూ!