-
-
By Chowdary
Updated :
15 November 2025 01:39 PM
బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది, పచ్చని కలను సాకారం చేస్తున్నారు నంబూరి మనోజ. నేల విలువ తెలిసిన ఈమె రైతుకష్టం అందరికీ తెలియాలనుకున్నారు. పాఠశాల విద్యార్థులకి విద్యతోపాటు తోటపనీ నేర్పిస్తున్నారు. ఇందుకుగానూ ఏపీ విద్యాశాఖ మంత్రి అభినందనలు పొందారు. ఆమె గురించి తెలియాలంటే...
తనకీ, తన విద్యార్థులకూ వ్యవసాయం ఎంతో ఇష్టమంటారు మనోజ. సాధారణంగా పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయం గడిపేది గురువులతోనే. అందుకే తన విద్యార్థులకి నైతిక పాఠాలూ నేర్పాలనుకున్నారు మనోజ. ఈమె విజయవాడలోని మంగళాపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని. 28ఏళ్లుగా చిన్నారులకు వ్యవసాయం నేర్పిస్తున్నారు. ఆ అంశాలనే మనబడి విద్యా మాస పత్రికలో ‘మా తోట’ పేరుతో కథగా రాసి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మన్ననలూ పొందారు. ఈమె తండ్రి ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. చిన్నప్పటి నుంచి అన్నదాతల కష్టాలను దగ్గర నుంచి చూసి తనూ వ్యవసాయం చేయాలనుకున్నారట. అందుకే చిన్నవయసులోనే నాన్నని అనుసరిస్తూ దొండ, మొక్కజొన్న, వంగ వంటివి పండించేవారీమె. ఇప్పటివరకూ విశాఖలోని రావికమతం, కృష్ణాలోని అగిరిపల్లి, గూడవల్లి ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు మనోజ. ప్రతి చోటా విద్యార్థులకు కిచెన్ గార్డెనింగ్ అలవాటు చేస్తున్నారు. ఈ పనిని పాఠాలు మాన్పించి కాదు, తరగతులు అయ్యాక ఖాళీ సమయాల్లోనే చేయిస్తుంటారు. ఎక్కువగా వంగ, బెండ, అరటి, పాలకూర వంటి వాటిని సేంద్రియ పద్ధతిలో సాగుచేయిస్తారు. వీటిని మధ్యాహ్న భోజనంలో వాడతారు. ‘నేను వెళ్లిన ప్రతిచోటా స్థలం దొరకడం నా అదృష్టం. ఇందుకు పిల్లల ఆసక్తీ తోడయ్యింది. అందుకే ఇన్నేళ్ల నుంచీ ఈ పని చేయగలుగుతున్నా. ప్రభుత్వం కిచెన్గార్డెన్కు నిధులను కొనసాగించాలి. ఇది ఎంతోమంది విద్యార్థులకి రైతుల కష్టాలు తెలుసుకునేలా చేస్తోంది’ అంటున్నారీమె.
టర్ల్ జాబితాలో మంగళాపురం పాఠశాల...
రెండేళ్ల క్రితం టర్ల్ కార్యక్రమంలో భాగంగా పరిశీలన నిమిత్తం నైజీరియన్లు మంగళాపురం వచ్చారు. ‘టర్ల్’ (టీచింగ్ ఎట్ రైట్ లెవల్) ఇది ఒక ఎన్జీవో. ప్రపంచవ్యాప్తంగా వెనకబడిన పిల్లలకు ఫండింగ్ ఇస్తుంటుంది. విద్యార్థుల్ని రైతుల్ని చేయాలనుకునే ఈమె ఆలోచన వారికి నచ్చి ఈ స్కూలుకి నిధులు ఇస్తున్నారు. అంతేకాదు, మనోజ విధానాలు నచ్చి వాళ్ల దగ్గరి స్కూళ్లలోనూ అమలుచేస్తున్నారు.