-
-
By Chowdary
Updated :
20 November 2025 06:23 PM
అమ్మాయి ఎక్కువ చదవకూడదు... ఇది ఆ ఊర్లో ఉండే కఠిన నియమం. అలాంటి గ్రామంలో పుట్టిన ఓ చిన్నారి పుస్తకాలపై ప్రేమ పెంచుకుంది. ఎన్నో ఆంక్షల మధ్య కష్టపడి చదివి టీచర్ అయ్యింది. పేద, వెనకబడిన విద్యార్థులకు పాఠాలు చెబుతూ సమాజంలో మార్పు తీసుకువస్తోంది దర్శనా చౌధరి.
హరియాణలోని ఫతేహాబాద్ జిల్లాలోని బుధ కలాన్ గ్రామంలో పుట్టి పెరిగారు దర్శన. ముగ్గురు అక్కచెల్లెళ్లలో పెద్దమ్మాయి. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. ‘మా ఊర్లో అమ్మాయి ఎక్కువ చదువుకుంటే పెళ్లికి అబ్బాయి దొరకడం కష్టం అనేవారు. అందుకే నన్నూ పది, పన్నెండు తరగతుల వరకూ చదివించి ఆపేశారు. అదీగాక పై చదువులు చదవాలంటే పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఒంటరిగా అంతదూరం పంపడం ఇష్టం లేని అమ్మానాన్నలు నన్ను చదువు మాన్పించేశారు. కానీ, నేను ప్రైవేట్‌గా చదవాలనుకున్నా. ఎలాంటి శిక్షణా లేకుండానే డిగ్రీ, బీఈడీ పూర్తిచేశా. దీనికి చాలా కష్టపడ్డా’ అంటారీమె.
ముందు ఊరిని మార్చాలని...
‘వివాహం తర్వాత ప్రైవేట్ స్కూల్లో పనిచేసేదాన్ని కానీ, నాకు గ్రామాల్లోని విద్యార్థులకి పాఠాలు చెప్పాలనిపించేది. ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించా. రాజస్థాన్‌లోని ధౌల్పుర్ జిల్లాలోని కటైల్పురాలో పోస్టింగ్. అదొక మారుమూల గ్రామం. దారంతా బురద. చాలా దూరం నడిచాక చివరికి ఓ చిన్న భవనం కనిపించింది. అదే బడి. అందులో ఉన్నది కేవలం 17మంది విద్యార్థులే. వాళ్లు కూడా మధ్యాహ్న భోజనం తినడానికి వస్తారని తెలిసి ఆశ్చర్యపోయా. అప్పుడే స్కూల్ కంటే ముందు ఊరుని మార్చాలనుకున్నా. ఇందుకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి... చదువు ప్రాముఖ్యతను అర్థమయ్యేలా చెప్పాను. కొంతమంది వింటే మరికొందరు సోదిగా భావించేవారు. అసలు సమస్య ఏంటంటే... స్కూల్లో చాలామంది విద్యార్థులకి కనీసం అక్షరాలు కూడా రావు. ఇందుకు టైమ్ టేబుల్ వేసుకుని వెళ్లి పాఠాలు చెప్పేదాన్ని. క్రమంగా వారు స్కూల్ మీద ఇష్టాన్ని పెంచుకునేలా చేయగలిగా.
సెల్‌ఫోన్ కాంతిలోనే పాఠాలు...
విద్యార్థులు చదువుకునేందుకు సుముఖంగా ఉన్నా... బడిలో సమస్యలు తప్పలేదు. ముఖ్యంగా గ్రామంలో విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్ఫార్మ్ర్లు తొలగించారు. దాంతో చెట్ల కిందే పిల్లల చదువు సాగేది. వర్షం పడిందంటే అందరినీ ఒకే గదిలో ఉంచి పాఠాలు చెప్పాల్సి వచ్చేది. మొబైల్‌ఫోన్ లైట్ వెలుగులోనే పిల్లలు చదువుకునేవారు. అయినా సరే, ఆ ఇబ్బందులను పట్టించు
కోకుండా నేర్చుకోవడం పైనే వారు శ్రద్ధ పెట్టారు’ అని చెబుతారు దర్శన.