-
-
By Chowdary
Updated :
20 November 2025 06:22 PM
మహిళలపై అడుగడుగునా ఆంక్షలుండే అఫ్గానిస్థాన్‌లో జీవితం నిత్యనరకం. 15 ఏళ్ల దాకా ఈ నరక కూపంలోనే మగ్గింది రోయా కరీమీ. బలవంతంగా 14 ఏళ్లకే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి.. 15 ఏళ్లకు ఓ బిడ్డకు తల్లైంది. అయితే జీవితాంతం ఇలాంటి బానిస బతుకు బతకాలనుకోలేదామె. ఎలాగైనా ఇక్కడ్నుంచి బయటపడి స్వేచ్ఛగా, తనకు నచ్చినట్లుగా జీవించాలనుకుంది. ఈ ఆలోచనతోనే అతి కష్టమ్మీద తాలిబన్ల చెర నుంచి బయటపడి నార్వే చేరుకుంది. అక్కడ శరణార్థిగానూ ఎన్నో కష్టాలు పడింది. కట్‌చేస్తే.. ఇప్పుడు అక్కడ ఆమె ఓ టాప్ బాడీబిల్డర్. జాతీయ స్థాయిలో నిర్వహించే బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలెన్నో కొల్లగొడుతోంది. అలా ఇటీవలే ‘నార్వే క్లాసిక్’, ‘యూరోపియన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్స్’ గెలుచుకున్న రోయా.. త్వరలో జరగబోయే ‘ప్రపంచ బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్స్’లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఇలా ఆమె ప్రతిభ, ఆట పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూ ‘అంతర్జాతీయ ఫిట్నెస్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్’ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె కథ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ సమాజపు కట్టుబాట్లు కొంతమంది స్వేచ్ఛను హరిస్తుంటాయి. అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో పుట్టి పెరిగిన రోయా 15 ఏళ్ల దాకా ఇలాంటి కఠినమైన కట్టుబాట్ల మధ్యే మగ్గింది. అక్కడి తాలిబన్ల పాలనతో పడరాని కష్టాలు పడింది. ఆడపిల్లలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, మగతోడు లేకుండా బయటికి వెళ్లకూడదు.. ఇలాంటి ఆంక్షలతోనే నిత్యం సావాసం చేసిందామె.