-
-
By Chowdary
Updated :
20 November 2025 06:21 PM
బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. నగరాల్లో స్థిరపడాలి. వెనకబడిన గ్రామాల్లో పుట్టి పెరిగిన ప్రతి అమ్మాయి కనే కలలే ఇవి. కానీ శివానీ రాణా ఆలోచనలు వీటన్నింటికీ అతీతం. అవే ఆమెను 21ఏళ్లకే ఆ గ్రామానికి సర్పంచ్‌ను చేశాయి.
వసతుల లేమి, ఉపాధి కొరత, వలసలు... ఏళ్ల తరబడి ధార్గావ్ను పట్టి పీడిస్తున్న సమస్యలు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఉందీ గ్రామం. సమస్యల పరిష్కారం కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా... ఉపయోగం లేకపోయింది. దాంతో వలసలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. వాటిని నిర్మూలించి, గ్రామ ఉనికిని కాపాడుకోవాలన్న లక్ష్యం శివానిది. ‘నేను పుట్టిపెరిగిన గ్రామం కళ్లముందే తుడిచిపెట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయా. చిన్నప్పట్నుంచి సామాజిక సేవ అంటే ఇష్టం నాకు. నాన్నతోపాటే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ప్రస్తుతం హేమవతి నందన్ బహుగుణ గఢ్వాల్ సెంట్రల్ యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్నా. గ్రామంలో సమస్యల పరిష్కారానికి నావంతు కృషి చేయాలని ఉండేది.అందుకే వీలున్నప్పుడల్లా వాటికోసం ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా ఆలోచనల్ని అమలు చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుండేదాన్ని. గతేడాది ఆ అవకాశం రానే వచ్చింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’ అనే శివాని ఈ విషయాన్ని తండ్రి విశాల్ సింగ్ రాణాకు చెప్పిందట. ఆయన దాన్ని గ్రామ పెద్దలకు తెలియజేశారు. ‘వాళ్లతో జరిగిన సమావేశంలో గ్రామీణాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికల్ని... అమలు తీరుని వివరించాను. వాళ్లకి నా ఆలోచనలు బాగా నచ్చాయి. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు’ అనే శివాని ఎంపిక అంత సులువుగా జరగలేదు. నామినేషన్ వేసేనాటికి ఆమె వయసు ఎన్నికల వయో పరిమితి కన్నా మూడు నెలలు తక్కువ. గ్రామస్థుల నిర్ణయాన్ని ఎన్నికల అధికారులు కొట్టివేశారు. మళ్లీ ప్రక్రియను చేపట్టినా... ఒక్కరూ నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదట. దాంతో మూడునెలలు పూర్తయ్యాక ఇటీవల మళ్లీ ఆమె ఆ పదవికి నామినేషన్ వేసి గెలుపొందింది. ‘గ్రామస్థులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వను. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. వలసల్ని తగ్గిస్తా. మిగిలిన చదువుని ఓపెన్ యూనివర్సిటీలో పూర్తిచేస్తా’ అంటారు శివాని. వయసు, అనుభవం వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా... అభివృద్ధి, మంచి ఆలోచనలకు పట్టం కట్టిన ఈ ఎన్నిక భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం కదూ!