-
-
By Chowdary
Updated :
20 November 2025 06:20 PM
క్రికెట్, చదరంగం, ఒలింపిక్స్ల్లో అమ్మాయిలు ట్రోఫీలూ, పతకాలూ తెస్తుండటంతో పిల్లలూ క్రీడలవైపు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలు చదువు మాత్రమే తమ పిల్లల జీవితాల్ని మారుస్తుందని భావించేవి. ఈతరం తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లల్ని క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. అక్కడ రాణించాలంటే ఆర్థిక ప్రణాళికా అవసరమే.
పిల్లలు వయసుతోపాటు క్రీడల కెరియర్లో ఒక్కో మెట్టు పైపైకి వెళ్తుంటారు. దీనికి సమాంతరంగా ఆర్థిక ప్రణాళికా ఉండాలి. గాయాలు, ప్రమాదాల్లాంటివి క్రీడాకారుల కెరియర్ను ఒక్క రోజులోనే మార్చేస్తాయి. కాబట్టి ఆరోగ్య, ప్రమాద బీమాలు ఉండాలి. వీటితో నాణ్యమైన చికిత్సను వేగవంతంగా అందించే సౌలభ్యం ఉంటుంది. ధైర్యంగా మళ్లీ మైదానంలో అడుగుపెట్టేలా చేస్తాయి.
మ్యాచ్‌లు ఆడుతుంటే పారితోషికాలు, స్పాన్సర్‌షిప్‌లు, నగదు బహుమతులు వస్తుంటాయి. ఇంకా పైకి వెళ్తే కాంట్రాక్టులూ దక్కుతాయి. ఇవన్నీ రాణిస్తున్నప్పుడే! ఏదైనా కారణంవల్ల అనుకున్న ఫలితాలు రాకపోతే? ఆ సమయంలోనూ ఆట కొనసాగాలి. అందుకని 6నెలలపాటు శిక్షణ, ఆహారం, క్రీడా పరికరాలు కొనేందుకు అత్యవసర నిధి ఉండాలి. దీన్ని తల్లిదండ్రులు పిల్లల పేర లేదంటే తమ పేరున ఎఫ్డీ, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం మంచిది. కావాల్సినప్పుడు నగదుగా మార్చుకోవచ్చు.
డబ్బులు రాగానే బ్రాండెడ్ గ్యాడ్జెట్లు, కార్లవైపు మనసు మళ్లుతుంది. ఎందరో క్రీడాకారులు మొదట్లో ఒక వెలుగు వెలిగి, తర్వాత కనుమరుగైన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి స్పాన్సర్షిప్, ఫీజులు వచ్చినప్పుడు వస్తువులు కొనేందుకే ఖర్చు చేయొద్దు. ప్రారంభంలో తల్లిదండ్రులు, ఆదాయం వచ్చాక క్రీడాకారిణులు... ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించాలి. అవి బీమా, అత్యవసర నిధి, పెట్టుబడులు... చివరగా జీవనశైలి ఖర్చులు.
క్రీడల్లో కొనసాగుతూనే సెకండ్ ఇన్నింగ్స్‌కు ప్రణాళిక వేసుకోండి. మీవైన ఆసక్తులు, వ్యాపారం, శిక్షణ కేంద్రం ఏర్పాటు... ఏదైనా కావొచ్చు. చాలాముందుగానే దీన్నీ గుర్తించి నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే, ఆర్థిక స్వతంత్రత వస్తుంది. అమ్మాయిలకు ఆర్థిక ప్రణాళిక మరింత కీలకం. అబ్బాయిలకంటే ముందే వీళ్లు పెళ్లి, కుటుంబ జీవితంలో అడుగుపెట్టాల్సి రావొచ్చు. క్రీడల తర్వాత రెండో కెరియర్ గురించి ఆలోచించాలి. లేకపోతే ఆర్థిక స్వేచ్ఛ ఉండదు.
క్రీడాకారుల కెరియర్ వ్యవధి తక్కువ. కొన్ని రకాల ఆటల్లో 20ల్లోనే కెరియర్‌కు ముగింపు పలకాల్సి ఉంటుంది. 10-15 ఏళ్ల ఆదాయంతో వందేళ్ల జీవితానికి ప్రణాళిక వేసుకోవాలి. మొదటి నుంచీ ఆర్థిక క్రమశిక్షణ లేనిదే, ఇది సాధ్యం కాదు. దీనికోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలం కొనసాగే పథకాలను ఎంచుకోవాలి. స్థిరమైన పెట్టుబడులతోనే ఆర్థిక స్థిరత్వం వస్తుంది.