-
-
By Chowdary
Updated :
20 November 2025 06:19 PM
సీఏ పరీక్ష అంటేనే చాలామంది వెనకడుగు వేస్తారు.. అందులోనూ అమ్మాయిలంటే కుటుంబ సభ్యులు వద్దనే చెబుతారు... ఉత్తీర్ణత సాధించేసరికి కొందరికి సంవత్సరాలు పడుతుంది... కానీ ఆమె మాత్రం ఆగలేదు... కష్టమని చెప్పినా బెదరలేదు.. సకాలంలోనే పరీక్షలన్నీ పాసై... వృత్తిలో చేరారు. జాతీయస్థాయిలో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్(ఐఎస్ఏ) అసెస్మెంట్ పరీక్షలో తానేంటో నిరూపించారు... తొలిస్థానం సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచారు ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నె వెంకట రమ్య. ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, విజేతగా నిలిచిన సందర్భాలను ‘వసుంధర’తో పంచుకున్నారు.
మాది కృష్ణా జిల్లా బిల్లనపల్లి. తల్లిదండ్రులు సాయిరాణి, నాగేశ్వరరావు. వ్యవసాయ కుటుంబం. మేమిద్దరం ఆడపిల్లలం. అమ్మ పదో తరగతి వరకు చదువుకుంది. టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ కూడా వచ్చు. తనకి చదువంటే చాలా ఇష్టం. అయితే, అక్కకి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే పెళ్లవ్వడంతో... నన్నైనా బాగా చదివించాలనుకుంది. అమ్మ బంధువుల్లో సీఏ చదివినవారు ఉండడంతో నన్ను అందులో చేర్పించాలని అనుకునేది. అందుకే పెళ్లి ప్రస్తావన తెచ్చేది కాదు. అలా ఆమె కోసమే ఛార్టర్డ్ అకౌంటెంట్ అయ్యా.
ఫైనల్లో ఫెయిలైనా...
చిన్నప్పటి నుంచి పోటీతత్వంతో మెలిగేదాన్ని. ప్రాథమిక విద్యంతా తెలుగు మాధ్యమంలోనే సాగింది. ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చదివా. అయినప్పటికీ ఆరో తరగతి నుంచి డిప్లొమా వరకూ తరగతిలో నేనే ఫస్ట్. పాలిటెక్నిక్‌లో జిల్లాలో మూడో ర్యాంకు సాధించా. ఈక్రమంలో సీఏపై అవగాహన పెంచుకున్నా. కొందరు వద్దని చెప్పారు. పాసవ్వవు, ప్రత్యామ్నాయం చూసుకో అని సూచించారు. అయినా వెనకడుగు వేయలేదు. 2008లో చేరి, 2012 నవంబరు నాటికి ఫౌండేషన్, ఇంటర్, ఆర్టికల్‌షిప్... అన్నీ సకాలంలో పూర్తి చేశాను. ఇదే సమయంలో అమ్మమ్మ కాలం చేయడంతో ఫైనల్లో మాత్రం ఫెయిలయ్యా. ఓటమిని నా మనసు అంగీకరించలేదు. మళ్లీ పట్టుదలతో పరీక్ష రాశాను. ఆర్టికల్ షిప్లో మా గురువు ఎంఎస్వీ రమణమూర్తి గైడ్ చేశారు. ఆయన సహకారంతో ఉత్తీర్ణత సాధించా. ఐపీసీసీ వరకు శిక్షణ తీసుకున్నా. ఏడాదంతా పూర్తిగా చదువుకోసమే కేటాయించా. చివరి మూడు నెలలు రోజుకు 12-14 గంటలు చదివా. ఫౌండేషన్, ఇంటర్ కోర్సుకు రోజులో 8-10 గంటలు చదివా.
భర్త సహకారంతో...
మావారు వల్లభనేని సాయిరాం కుమార్ చౌదరిది విజయనగరం. దీంతో ఇక్కడే స్థిరపడ్డాం. ఇద్దరం సీఏ వృత్తిలోనే కొనసాగుతున్నాం. ఆయన సహకారంతో ముందుకెళుతున్నా. మాకిద్దరు పిల్లలు. లక్ష్మీముక్త, రోషన్ కపర్దీ. కుటుంబ బాధ్యతలున్నా, ప్రణాళిక పెట్టుకుంటాను. కార్యాలయం, ఇంటికి నిర్దేశిత సమయం కేటాయించి, టైమ్ మేనేజ్మెంట్ పాటిస్తాను.
కష్టమేమీ కాదు...
సీఏ కష్టంతో కూడుకున్నదని చాలామంది అభిప్రాయం. అది అపోహ మాత్రమే. అవగాహన, ఆసక్తి ఉంటే ఎవరైనా సాధించవచ్చు. ఆర్థికరంగంలో అవకాశాలుంటాయి. అంకితభావంతో ప్రతిరోజూ బాధ్యతగా చదవాలి. డిగ్రీ, ఇంజినీరింగ్లా చివరి సమయంలో పుస్తకాలు తీద్దామంటే కుదరదు. మహిళల్లో డ్రాపౌట్లు ఎక్కువగా ఉంటున్నారు. వారికి కుటుంబ సభ్యుల సహకారం అవసరం.
ఏఐపై దృష్టి...
సమాజంలో గౌరవప్రదమైనది సీఏ ఉద్యోగం. 2012 నుంచి దీనిలో కొనసాగుతున్నా. ఇందులో జీఎస్టీ, ఐటీ రంగాలకు సంబంధించి సవాళ్లుంటాయి. వాటిని ఎదుర్కొవాలి. ఇటీవల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించిన ఐఎస్ఏ పరీక్ష రాశాను. జాతీయస్థాయిలో ఉత్తమంగా నిలవడం ఆనందంగా ఉంది. అప్‌గ్రెడేషన్, స్పెషలైజేషన్ చేస్తా. మంచి ప్రొఫెషనల్ అవకాశాల కోసం ఆడిట్రంగంలో కొత్తగా పరిచయమవుతున్న ఏఐ(కృత్రిమ మేధ) సాఫ్ట్వేర్ కోర్సులు చేయాలన్నది నా భవిష్యత్తు లక్ష్యం.