-
-
By Chowdary
Updated :
15 November 2025 01:38 PM
మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు పదోన్నతుల విషయంలో వెనకబడుతుంటారు. అలాగని పనిచేయరనా? కాదు... తమ పని గురించి చెప్పుకోరు. అదే తప్పంటారు నిపుణులు. అందుకే, కొన్ని అంశాలపై తప్పక దృష్టిపెట్టాలంటారు.
‘పైవాళ్లతో ఏం మాట్లాడతాం?’ చాలామంది ఉద్యోగినుల ఆలోచన ఇదే! కాబట్టే తమ ప్రణాళికలు, కొత్త వ్యూహాల గురించి పైకి చెప్పరు. ఇలాంటప్పుడు మీ పనితనం ఎలా తెలుస్తుంది? ఈ తీరే వద్దు. అందరి ముందూ మాట్లాడటానికి భయమైతే మెసేజ్, రిపోర్టు ద్వారా అయినా ఆలోచనలను పంచుకోవచ్చు. ఇది మీపై సానుకూల ముద్ర వేయడానికి సాయపడుతుంది.
కష్టపడి పనిచేయడం... దీనిపైనే దృష్టిపెట్టొద్దు. కొత్త ప్రాజెక్టులను తీసుకోండి. సమస్యలేమైనా ఉంటే పరిష్కారాలను సూచించండి. తోటివారికి అవసరమైతే సాయం చేయండి. ఇవన్నీ నాయకత్వ లక్షణాలే. నడిపించేవారిని పదోన్నతులు తప్పక అనుసరిస్తాయి.
నిన్నలా నేడు ఉండట్లేదు. సాంకేతికత సైలెంట్‌గా పనిలోకి చొచ్చుకొని వస్తోంది. ఆ వేగాన్ని అందుకోవాలంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోక తప్పదు. పనికి సంబంధించి అలాంటి అవసరమైన టూల్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేసుకుంటూ ఉండండి. వాటిని నేర్చుకుంటూ ఉండండి. ఇవీ మిమ్మల్ని ప్రత్యేకంగా నిలిపేవే.
బాగా పని చేస్తున్నాం అని మనం అనుకోగానే సరిపోదు. ఇతరులూ అనుకోవాలి. మీ పనితీరు, చేసుకోవాల్సిన మార్పులు ఈ రెండింటి గురించి తప్పక తెలుసుకోండి. ఇందుకోసం పైవాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుని, తగ్గట్టుగా మిమ్మల్ని మార్చుకోండి. తమని తాము మెరుగుపరచుకోవాలి అనుకునేవారిని ఏ సంస్థ మాత్రం వదిలేస్తుంది?
నిన్న కాదు... నేడే ముఖ్యం అన్నది ఇంకెక్కడైనా పనికొస్తుందేమో కానీ ఉద్యోగం విషయంలో కాదు. గత విజయాలు రాసిపెట్టుకోండి. అవసరమైన సందర్భాల్లో వాటిని ఉదహరించండి. ఇది సొంత డప్పు కాదు... మీ విలువ తెలియజేసే మార్గం. విలువ తెలిసినప్పుడే దానికి తగ్గ అందలం దక్కేది. కాబట్టి పనిచేస్తున్నాం చాలన్న భావనొద్దు. దానికి కావాల్సిన అదనపు విలువల్నీ జోడించుకోవాలి. అప్పుడే కెరియర్లో ముందుకు సాగుతారు మరి.