-
-
By Chowdary
Updated :
20 November 2025 06:15 PM
‘చీరలోని గొప్పతనం తెలుసుకో...’అంటూ న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ పరిసరాల్లో వందల మంది మహిళలు... చీరకట్టుతో మెరిసిపోయారు. ‘శారీ గోస్ గ్లోబల్’ కార్యక్రమం రెండో ఎడిషన్‌ను ఫిలాంత్రపిక్ సంస్థ ఉమా గ్లోబల్, అక్కడి భారత కాన్సులేట్ జనరల్‌తో కలిసి దీన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీతో పాటు భారత్, బంగ్లాదేశ్, నేపాల్, వెస్టిండీస్, యూకే, మలేసియా, సింగపూర్, శ్రీలంక... వంటి దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. టైమ్స్ స్క్వేర్ చుట్టూ సింబాలిక్ మార్చ్ చేశారు. తరాల కథలెన్నో చెబుతూ, వేల ఏళ్ల ఘనచరిత్రను గర్వంగా ప్రదర్శించారు. ‘శారీ గోస్ గ్లోబల్’ ఈవెంట్ సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకొనే వేడుక మాత్రమే కాదు. సంప్రదాయ చేతివృత్తులను కాపాడుతూ, వారికి మద్దతు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వేదిక కూడా. ఈ కార్యక్రమం మనందరినీ ఒక్క తాటిపై నిలుపుతుంది. మరోసారి టైమ్స్ స్క్వేర్ మన సంస్కృతీ, ఆత్మవిశ్వాసంతో నిండిన వర్ణ సముద్రంలా కనిపిస్తుంటే గర్వంగా ఉంది’ అంటారు ఉమా గ్లోబల్ అధ్యక్షురాలు డాక్టర్ రీటా కాకతి షా. అసోంలోని సువాల్కుచీలో నేసిన సంప్రదాయ పాట్సిల్క్ మెఖేలా సడోర్ని ఆమె ధరించారు. న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటైన ఉమా గ్లోబల్ సంస్థ యువత, మహిళా సాధికారత కోసం కృషిచేస్తోంది.