-
-
By Chowdary
Updated :
20 November 2025 06:14 PM
మొటిమలు టీనేజర్లకు పెద్ద సమస్య. కానీ కొన్నిసార్లు 30 దాటాకా కూడా కొందరిలో కనిపిస్తుంటాయి. ఎందుకిలా అంటే...
నూనెలు ఎక్కువగా విడుదలవ్వడం, చర్మరంధ్రాలు మూసుకుపోవడం, బ్యాక్టీరియా చేరడం, ఇన్ఫ్లమేషన్... ఇలా మొటిమలు రావడానికి బోలెడు కారణాలు. టీనేజర్లలో అయితే హార్మోన్ల ప్రభావం వల్ల పలకరిస్తుంటాయి. వయసు పెరిగే కొద్దీ తగ్గుతాయి. ఆ తరవాతా వస్తోంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి పాతికేళ్లు దాటాక వచ్చే వాటిని అడల్ట్ యాక్నే అని అంటారు. హార్మోనుల్లో అసమతుల్యత, ఒత్తిడి, ఉపయోగించే చర్మ, కేశ ఉత్పత్తులు పడకపోవడం వంటివాటి వల్ల వీళ్లలో మొటిమలు వస్తుంటాయి. వీటిని అడ్డుకోవాలంటే ముందు వాడే ఉత్పత్తులను కొన్నిరోజులు పరీక్షించాలి. అలాగే కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. రసాయనాల్లేని మైల్డ్ క్లెన్సర్‌తో రోజుకు రెండుసార్లు తప్పక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గట్టిగా రుద్దడం, స్క్రబింగ్ వంటివి చేయకూడదు. ఆస్ట్రింజెంట్స్, మాస్క్‌లను ఇలాంటప్పుడు వాడొద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడం, మేకప్‌కి దూరంగా ఉండటం వంటివీ చేయాలి. ఇవన్నీ చేసినా సమస్య తగ్గకపోతే అప్పుడు నిపుణులను సంప్రదించాలి. శాల్సిలిక్యాసిడ్, రెటినాల్ వంటి క్రీములను సూచిస్తారు. అదే నెలసరి, హార్మోన్ల సంబంధిత సమస్యలుంటే క్రీములే సరిపోవు. తగిన చికిత్సా తీసుకోవాలి. కాబట్టి, మొటిమే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. తగ్గ కారణాన్ని తెలుసుకోవాలి, పరిష్కరించుకోవాలి.