-
-
By Chowdary
Updated :
20 November 2025 06:12 PM
కాలుష్యం, తీసుకునే ఆహారం, వాతావరణ మార్పులు, తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం, నెరిసిపోవడం, చుండ్రు.. ఇలా పలు రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ క్రమంలో కొంతమంది బయటి ఉత్పత్తుల కంటే సహజ చిట్కాలకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. ఉల్లిపాయ నూనె కూడా ఇదే కోవలోకి వస్తుందంటున్నారు నిపుణులు. జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ నూనెను తయారుచేసుకోవడం కూడా ఎంతో సులువు.
ఇలా తయారుచేసుకోవచ్చు!
కావాల్సినవి
⚛ ఎర్ర ఉల్లిపాయలు - 2 (మీడియం సైజువి)
⚛ కొబ్బరి నూనె - కప్పు
⚛ నువ్వుల నూనె - కప్పు
తయారీ
⚛ ముందుగా ఉల్లిపాయలపై పొట్టు తొలగించి పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఈ క్రమంలో కావాలంటే కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకోవచ్చు.
⚛ ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టి.. అందులో ఈ ఉల్లిపాయ పేస్ట్, మిగతా కొబ్బరి నూనె, నువ్వుల నూనె వేసి బాగా కలుపుకోవాలి.
⚛ పెద్ద మంట పైన పెట్టి ఒక పొంగు వచ్చాక.. సిమ్ చేసి ఓ అరగంట పాటు మరిగించుకోవాలి. తద్వారా ఉల్లిపాయలోని సుగుణాలన్నీ నూనెలోకి చేరతాయి.
⚛ ఆ తర్వాత స్టౌ కట్టేసి నూనె చల్లబడే దాకా పక్కన పెట్టేయాలి.
⚛ ఆపై ఒక శుభ్రమైన క్లాత్ సహాయంతో ఈ నూనెను వడకట్టుకోవాలి. దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు.
కుదుళ్లు దృఢంగా.. జుట్టు ఒత్తుగా..!
⚛ ఉల్లిపాయ నూనెను కుదుళ్లపై వేసి మునివేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకోవాలి. తద్వారా కుదుళ్లలో రక్తప్రసరణ మెరుగవుతుంది.. నూనెలోని పోషకాలూ కుదుళ్లలోకి ఇంకుతాయి. ఫలితంగా కుదుళ్లు దృఢమై జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉల్లిపాయలో అధికంగా ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు.
⚛ కుదుళ్లు పొడిబారిపోవడం, అక్కడి చర్మం ప్యాచుల్లాగా రాలిపోవడం, చుండ్రు.. వంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఉల్లిపాయ నూనె ఉపయోగిస్తుంది. ఈ నూనెలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇలాంటి కుదుళ్ల సమస్యల్ని తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయట.
⚛ ఉల్లిపాయ నూనె క్యారియర్ ఆయిల్లా ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా అత్యవసర నూనె వాడాలనుకున్నప్పుడు దాన్ని ఈ నూనెలో చేర్చుకొని ఉపయోగిస్తే.. రెండు నూనెల్లో ఉన్న సుగుణాలు కుదుళ్లకు, జుట్టుకు సంపూర్ణంగా అందుతాయంటున్నారు.
⚛ ఉల్లిపాయ నూనె జుట్టుకు కండిషనర్‌లా కూడా ఉపయోగపడుతుంది. రోజూ ఈ నూనెతో మర్దన చేసుకుంటే కేశాలు పొడిబారిపోవడం, నిర్జీవమైపోవడం, గడ్డిలా మారిపోవడం.. వంటి సమస్యలకు చెక్ పెట్టచ్చంటున్నారు.