-
-
By Chowdary
Updated :
15 November 2025 01:36 PM
ఒకప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే... అమ్మమ్మలు నానమ్మలు ఎన్నెన్ని గేయాలు నేర్పేవారో! ఇప్పుడందరిదీ యూట్యూబ్ బాటే. నేర్పేదీ ఇంగ్లిష్ రైమ్లే. మన పరిస్థితే ఇలా ఉంటే ఇక విదేశాల్లో స్థిరపడిన వాళ్ల సంగతేంటి? పిల్లలు తెలుగు మర్చిపోవాల్సిందేగా! తన బాబుకి ఆ పరిస్థితి రావొద్దు అనుకున్నారు మధురిమ పరిగి. అందుకే అమెరికాలో తెలుగు గేయాల పుస్తకాలను అందిస్తున్నారామె. ‘వసుంధర’తో ఆ ప్రయాణాన్ని పంచుకున్నారు...
మాది వైజాగ్. నాన్న మదన్మోహన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమ్మ మీనాక్షి బ్యాంకు వైస్‌ప్రెసిడెంట్. అమెరికాలో స్థిరపడ్డా... పిల్లలు భారత్‌లోనే పుట్టాలనుకున్నారు. కాన్పు కోసం ప్రత్యేకంగా అమ్మని ఇండియా తీసుకొచ్చారట నాన్న. ఇంట్లో తెలుగే మాట్లాడాలనేవారు. రాయడం, చదవడం దగ్గరుండి నేర్పించారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లలకీ ప్రతి ఆదివారం తెలుగు పాఠాలు చెప్పేవారు. అలా నాకూ మాతృభాషంటే మమకారం. మా నాన్నలా నేనూ నా పిల్లలకు నేర్పాలి అనుకునేదాన్ని. బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసి, ఒక మెడికల్ డివైజ్ సంస్థలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేస్తున్నా. నాకు రెండేళ్ల బాబున్నాడు. మావారేమో పంజాబీ. మా ఇద్దరి ఉమ్మడి భాష ఇంగ్లిషే. అలాంటప్పుడు ఇక బాబుకి మాత్రం తెలుగెలా వస్తుంది? ఈ బెంగే పట్టుకుంది నాకు. కేవలం నేనే మాట్లాడితే సరిపోదు. అందుకని పుస్తకాలూ చదివి వినిపించాలనుకున్నా. కానీ బోర్డు బుక్స్ లాంటివి ఇంత చిన్నపిల్లలకి తెలుగులో కనిపించలేదు. నాన్న మాకోసం చందమామ తెప్పించేవారు. ఆ కథలు అర్థం చేసుకునే వయసు బాబుది కాదు. అందుకే నేనే తేవాలనుకున్నా.
మా కుటుంబంలోనే ఉంది
మా తాతగారు రచయిత. నాన్న కూడా మాకోసం తెలుగు పుస్తకాలు రాశారు. వాళ్ల స్ఫూర్తితో నేను ‘చిట్టి చిలకమ్మ, చుక్ చుక్ రైలు’ వంటి గేయాల్ని బోర్డు పుస్తకాల్లో తీసుకొచ్చా. వీటికోసం అందమైన బొమ్మలూ వేయించా. ఎవరైనా చదివి వినిపించగలిగేలా ఆంగ్ల అక్షరాల్లో తెలుగు పదాలను రాయించా. అవి బాబుకి బాగా నచ్చాయి. పదే పదే చదవమంటాడు. ఆ సంగతుల్ని ఇన్‌స్టాలో పెడితే చాలామంది మాకూ కావాలి, చేసిమ్మని అడిగేవారు. వాళ్లకి చేసివ్వడం మొదలుపెట్టా. అప్పుడే మన తెలుగు పాటలు, కథల పుస్తకాలకు డిమాండ్ ఉందని అర్థమైంది. అలా ‘బాలూ బుక్స్’ ప్రారంభించా. ఇక్కడ మాలాగే తెలుగు- ఇంగ్లిష్, తెలుగు- ఇతర భారతీయ భాషలతో కూడిన మిక్స్డ్ కుటుంబాలే ఎక్కువ. అలాంటి వాళ్లందరికీ మా పుస్తకాలు చేరువయ్యాయి. గేయాలు, కథలే కాదు... లేవడం, నడవడం, కూర్చోవడం వంటి బేసిక్ పదాలతోనూ పుస్తకాలు చేయించాం. తమ భార్య లేదా భర్తకోసం తెలుగు నేర్చుకోవాలి, ఆ సంప్రదాయాలు తెలియాలి అనుకునేవాళ్లూ కొనుక్కుంటున్నారు. అసలు ఇంత ఆదరణ ఉంటుందని మేమూ ఊహించలేదు.
ఒక్కదానిగా మొదలై...
మొదట్లో గేయాల ఎంపిక నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఏడాది తరవాత శ్రావ్య మార్కెటింగ్‌లో సాయం చేస్తానంది. నేనూ సరేనన్నా. నిజానికి తనూ నా పుస్తకాన్ని కొనుక్కుని నచ్చి, చేతులు కలిపింది. బొమ్మలు మాత్రం ఓ గ్రీకు అమ్మాయితో వేయిస్తున్నా. మా చిన్నప్పటి పుస్తకాల్లో ఉన్న వైబ్రెంట్ కలర్స్, ఎక్స్ప్రెషన్స్ గీయగల వారికోసం చాలా వెతికా. తనవి నా ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయని ఎంచుకున్నా. చీర, బొట్టు ఇలా ప్రతిదానికీ రిఫరెన్స్ చూపిస్తాం. నచ్చాకే అచ్చు వేయిస్తా. ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేస్తున్నా. అలాగని బాబుని నిర్లక్ష్యం చేయను. సృజనకు ప్రాధాన్యమిస్తా కదా... అందుకే అమ్మ, ఉద్యోగిని, వ్యాపారవేత్త మూడు బాధ్యతల్నీ ఆస్వాదిస్తున్నా. తీరిక దొరికినప్పుడల్లా భారత్ వస్తుంటాం. వచ్చిన ప్రతిసారీ ఇది నా ఇల్లు అనిపిస్తుంది. నా బాబుకీ అలాంటి భావనే కలగాలన్నది నా తాపత్రయం. అది మిగతావారికీ ఉపయోగపడుతోంది. మా పుస్తకాలు ఇతర దేశాలకూ వెళ్తున్నాయి. ఈ స్ఫూర్తితో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నా. యూఎస్‌లో తెలుగు పబ్లిషర్స్ లేరు. ఇక్కడ రాయాలన్న ఆసక్తి ఉన్నవారికి పబ్లిషింగ్‌లో సాయపడాలి అనుకుంటున్నా. ఇప్పుడా ప్రణాళికలోనే ఉన్నా.