-
-
By Chowdary
Updated :
20 November 2025 06:10 PM
నాజూగ్గా ఉండే స్నేహితురాల్ని చూసినప్పుడల్లా... నేనూ తగ్గితే బావుణ్ను అనుకోకుండా ఉండలేం. నచ్చిన డ్రెస్... మన సైజులో దొరకనప్పుడు కలిగే బాధను వర్ణించడమూ కష్టమే. దీనంతటికీ కారణం అధికబరువే. అది తిండితో ముడిపడి ఉంటే... నియంత్రించుకోవడం కాస్త కష్టమైన విషయమే. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించండి.
డైట్ నియంత్రణ కోసమంటూ... ఉదయాన్నే తినాల్సిన అల్పాహారాన్ని మాత్రం దాటేయొద్దు. ఎందుకంటే, రోజువారీ అవసరమయ్యే మీ శక్తికి కీలకవిటమిన్లు, ఇతర పోషకాలను ఇదే అందిస్తుంది. అంతేకాదు, టిఫిన్ తినకపోవడం వల్ల... మధ్యాహ్నం ఎక్కువ కెలోరీలు, స్వీట్స్ వంటివి అధికంగా తీసుకునే ప్రమాదం ఉందట.
లో కెలోరీలు, హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా బియ్యం, చపాతీ, స్వీట్స్, ఫ్రైలూ వంటివి తగ్గించాలి. బెండకాయ, వంకాయ, క్యాబేజీ, బత్తాయి, దానిమ్మ, మొలకెత్తిన గింజలు, గుడ్డులోని తెల్లసొన, లోఫ్యాట్ పాల ఉత్పత్తులు వంటివి చేర్చుకోవాలి.
కంటికి తక్కువగా కనిపించినప్పుడు కాస్త ఎక్కువ తినే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత చిన్న ప్లేట్లలో తినడానికి ప్రయత్నించండి. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా కొద్దికొద్దిగా తినండి. ఇందులో అన్ని రకాల పోషకాలూ అందేలా ఆహారపదార్థాల ఎంపిక ఉంటే మరింత మంచిది.
ఆకలితో సంబంధం లేకుండా తరచూ జంక్‌ఫుడ్, స్వీట్లు వంటివి తినే అలవాటుందా? అయితే, అలా అనిపించినప్పుడు ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగడం, పండ్లూ, నట్స్ వంటివి తీసుకోవడం చేస్తే ఆ ప్రయత్నం మానుకుంటారు. ఇక, కొన్నిసార్లు శరీరం డీహైడ్రేషన్‌కి గురయినప్పుడు కూడా తినాలన్న కోరిక కలుగుతుంది. దాన్ని నివారించడానికి తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి.