-
-
By Chowdary
Updated :
20 November 2025 06:09 PM
రెస్టరంట్లో భోజనమంటే ఎవరికైనా సరదానే! ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్లకు వెళ్తుంటాం. నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదిస్తుంటాం. అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే బయట భోజనం చేసినా మితంగా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంచుకుంటే సమస్యే ఉండదంటున్నారు. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
⚛ రెస్టరంట్లో అడుగుపెట్టగానే మనం చేసే మొదటి పని.. మెనూ చూడడం. ఈ క్రమంలో అందులో ఉన్న వెరైటీ ఆహారపదార్థాలు మన నోరూరిస్తుంటాయి. దీంతో అప్పటివరకు రుచి చూడని వాటిని ఆర్డర్ చేస్తుంటాం. వీటిలో చాలావరకు కొవ్వులు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్నవే ఉంటాయి. ఇవి ఆరోగ్యకరం కాదు కాబట్టి.. తెలిసి తెలిసి పొరపాటు చేయకుండా.. ఆ మెనూలోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మసాలా, కొవ్వులు.. వంటివి ఎక్కువగా వాడిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
⚛ కొంతమంది రెస్టరంట్లో భోజనంతో పాటు శీతల పానీయాల్ని ఆర్డర్ చేస్తుంటారు. నిజానికి దీనివల్ల చక్కెరలు, అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. అందుకే వీటికి బదులుగా నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.
⚛ మనం ఫుడ్ మెనూను పరిశీలిస్తే.. ఆయా వంటకాల ముందు స్టీమ్డ్, గ్రిల్డ్, రోస్టెడ్, ఫ్రైడ్.. ఇలా రాసుంటుంది. దీని ద్వారా ఆయా పదార్థాల్ని ఎలా తయారుచేశారో అర్థమవుతుంది. ఫ్రైడ్, క్రంచీ.. వంటి పదార్థాల్లో క్యాలరీలు, కొవ్వులూ ఎక్కువే! కాబట్టి ఆయా వంటకాల్ని ఎంచుకునే ముందు దాన్నెలా తయారుచేశారో అక్కడి వాళ్లను అడిగి తెలుసుకోవడంలోనూ తప్పు లేదు.
⚛ చాలామంది ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితమవుతుంటారు. ఒక్కోసారి ఇది కూడా అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి పదార్థాల్ని ఆర్డర్ చేసేటప్పుడు ఇతరుల నిర్ణయాలతో ప్రభావితం కాకుండా మీ అవసరాల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.
⚛ పిజ్జా, బర్గర్స్.. వంటివి ఆర్డర్ చేసినప్పుడు చాలామంది అదనంగా చీజ్తో టాపింగ్ చేయించుకుంటారు. దీనికి బదులుగా ఉడికించిన కాయగూర ముక్కల్ని ఎంచుకోవడం ఆరోగ్యకరం! అలాగే కొవ్వులు, ఉప్పు.. వంటివి ఎక్కువగా ఉండే సాస్లకు దూరంగా ఉండడం మరీ మంచిది.
అయితే ఈ రోజుల్లో పేరున్న హోటల్స్, రెస్టరంట్లలో కూడా ఆహారం కల్తీ జరుగుతోందన్న వార్తలు వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో సాధ్యమైనంతవరకు బయటి భోజనాన్ని మానుకోగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకోగలమంటున్నారు నిపుణులు.