-
-
By Chowdary
Updated :
20 November 2025 06:07 PM
‘ఎక్కడివక్కడ మర్చిపోతేనే మేలు’ అనడం వింటుంటాం. దీన్ని పాటించడమే మరచిపోతున్నారు అమ్మాయిలూ, మహిళలూ. అనవసరమైన విషయాల్ని గుర్తుపెట్టుకుని, అవి తెచ్చే ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఎందుకంత భారాన్ని మోయడం. మరుపే ప్రతిదానికీ మందు అంటున్నారు నిపుణులు...
ఊపిరి సలపని పనులు, బాధ్యతలు ఇవన్నీ తెచ్చే తలనొప్పి మాటల్లో చెప్పలేం. ఇంత చేస్తున్నా ఏదొక లోపంతో నిందించేవారు ఉండనే ఉంటారు. రోజూ చేసే వంటే అయినా... ఒక్కోసారి సరిగా కుదరదు. ఇక దొరికిందే అవకాశంగా తిట్లు పడుతూనే ఉంటాయి. అవన్నీ రోజంతటినీ ప్రభావితం చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. వంట అయిపోయింది. తినే వాళ్లు తినేశారు. మాటలు అనే వాళ్లు అనేశారు. దాన్నే తలచుకుని బాధపడినంత మాత్రన జరిగిపోయిన దాన్ని మీరు మార్చగలరా? ‘రేపు బాగా చేసి చూపిస్తా’ అని ఆ విషయాన్ని మరచిపోతే పోలా?
‘ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ ఏమీ బాగోలేదు అమ్మాయి. నివేదికలూ అర్థం కాని విధంగానే ఉన్నాయి. ఇదే కొనసాగితే వెనకబడిపోతావ్’ అంటూ కొన్ని సందర్భాల్లో యజమాని తిడుతూ ఉంటారు. అది మన మంచికే అయినా, ఆ పరిస్థితి సానుకూలంగా ఆలోచించే అవకాశం ఇవ్వదు. దాంతో ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి. ఆ ప్రభావం పనిమీదా పడుతుంది. ఎంతగా అంటే దాన్నే తలచుకుని మిగతా వేటిమీదా దృష్టి పెట్టలేనంతగా. అందుకే మరచిపోయి, తదుపరి పనుల మీదకు ధ్యాస మళ్లించుకుంటే ఎంత ఒత్తిడి తగ్గుతుందో ఒకసారి ఆలోచించండి.
కార్యాలయాల్లో... రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. ఒకరికొకరు నచ్చరు. అలాగని ఎవరినీ మనం మార్చలేం. తెల్లారితే మళ్లీ వాళ్ల ముఖాలు మనం, మన ముఖాలు వాళ్లూ చూడాల్సిందే. ‘పోనీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు... నేను ఫలానా అని ప్రతి ఒక్కరికీ చెప్పగలమా’ వ్యక్తిత్వాలు తెలుసుకుని, వాళ్లు ఇంతే అని సర్దుకుపోవాలి. అంతేకానీ వాళ్లు కావాలనే మనల్ని టార్గెట్ చేస్తున్నారని తెలిసినా... వాళ్లేదో అన్నారనీ, దాన్ని తిరిగి అప్పజెప్పాలనే ఆలోచనల్లో మీరుండిపోతే... నష్టం మీకే. ప్రతికూల సంఘటనల్నీ, వ్యక్తుల్నీ ఎక్కడికక్కడ వదిలేస్తేనే... మీకూ మనశ్శాంతి.
ఇవేనా... అలకలు, కోపాలు, గొడవలు... వంటివన్నీ తాత్కాలికమైనవే. సమయంతోపాటే సర్దుకుంటాయి. అలాంటి వాటికోసం ఆలోచిస్తూ... ప్రస్తుతాన్ని వృథా చేసుకుని, మానసిక సమస్యలకు తావివ్వడం సబబా. అందుకే ప్రతికూల ఘటనల్ని మరచిపోవడానికి ప్రయత్నించండి. మీకే తెలుస్తుంది ఈ పద్ధతి ఎంత ఉపశమనాన్ని ఇస్తుందో...