-
-
By Chowdary
Updated :
20 November 2025 06:06 PM
చలికాలం వచ్చిందంటే పగటి సమయం తగ్గిపోతుంటుంది. చలిగాలులు, రాత్రి సమయం ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యనే ‘వింటర్ బ్లూస్’గా వ్యవహరిస్తారు. సీజనల్ మార్పుల వల్ల ఇలాంటి సమస్య వస్తుందంటున్నారు నిపుణులు. ఒక్కోసారి దీనివల్ల అసౌకర్యానికి లోనై సరిగా పనిచేయలేకపోతుంటారు. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్‌గా (SAD)గా పిలుస్తుంటారు.
సీజనల్ మార్పుల వల్ల కలిగే ఈ సమస్యకు స్పష్టమైన కారణాలు తెలియకపోయినా.. కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే సంతోషంగా గడపచ్చని నిపుణులు చెబుతున్నారు.
శత్రువు కాదు..!
చలికాలంలో చాలామందికి ఎక్కడలేని బద్ధకం ఆవహిస్తుంటుంది. దీన్నుంచి బయటపడాలంటే దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. మనం చిన్న చిన్న పనులను కూడా క్రమబద్ధంగా చేస్తే ఉత్సాహం పెరుగుతుంది. కాబట్టి, ‘వింటర్ బ్లూస్’ లక్షణాలు కనిపిస్తే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం.. నచ్చిన సినిమా, వెబ్‌సిరీస్ చూడడం.. పార్క్‌కు వెళ్లడం.. నచ్చిన పుస్తకం చదవడం.. వంటి పనులు చేయాలంటున్నారు నిపుణులు. అలాగే మీకోసం సమయం కేటాయించుకుంటూ స్వీయ ప్రేమను అలవరుచుకోవాలంటున్నారు.
‘బాడీ డబ్లింగ్’ సిద్ధాంతాన్ని పాటించడం కూడా మరో ఎంపికంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా మరొకరి సమక్షంలో పనులను పూర్తి చేయాలి. ఉదాహరణకు ఇతర ప్రాంతంలో ఉన్న స్నేహితులతో కలిసి వర్చువల్‌గా ఒకే సినిమాను వీక్షించడం.. ఫోన్ మాట్లాడుతూ ఇంటి పనులు పూర్తి చేయడం.. వంటివి బాడీ డబ్లింగ్ కిందకే వస్తాయి. ఒకవేళ వారు పక్కనే ఉంటే కలిసి పనిచేయచ్చు. దీనివల్ల వల్ల బాధ్యత, అనుబంధం పెరగడమే కాకుండా వింటర్ బ్లూస్, SAD లక్షణాల నుంచి బయటపడచ్చని సూచిస్తున్నారు.