-
-
By Chowdary
Updated :
15 November 2025 01:34 PM
చర్మాన్ని లోలోపలి నుంచి మెరిపించే సహజసిద్ధమైన పదార్థాల్లో సబ్జా గింజలు ఒకటి. వీటిని ఆహారంగా తీసుకుంటే జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..
డీటాక్సిఫికేషన్..
వాహనాల నుంచి వెలువడే పొగ, కాలుష్యం కారణంగా.. చర్మం కాంతిని కోల్పోతుంది. దుమ్ము, ధూళి ప్రభావం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ క్రమంలో చర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు అందుకు సరైన ఎంపిక అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయట. దీనివల్ల సౌందర్య సమస్యలు తగ్గి చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
ఇన్ఫెక్షన్లు రాకుండా..
కొంతమందిలో చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చాయంటే ఓ పట్టాన తగ్గవు. అలాంటివారు క్రమం తప్పకుండా సబ్జా గింజలను ఆహారంగా తీసుకోవడం మంచిది. వీటిలో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్ గుణాల వల్ల చర్మం ఇన్ఫెక్షన్లకు గురవకుండా ఉంటుందంటున్నారు నిపుణులు.
ముడతలు పడకుండా..
కొంతమందికి ముప్ఫైల్లోకి రాగానే చర్మం ముడతలు పడుతుంటుంది. దీనివల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అయితే ఇలా కనిపించకుండా ఉండటం కోసం చాలామంది యాంటీ ఏజింగ్ క్రీంలను వాడుతుంటారు. కానీ ఈ సమస్యకు సబ్జా గింజలు మేలైన పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటితో తయారుచేసిన ఫేస్‌ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
కురులు దృఢంగా..
సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ 'కె', బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయి. అలాగే ఇవి కురులకు పోషణను అందించి పట్టులా, మృదువుగా మారేలా చేస్తాయి. సబ్జా గింజలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి కూడా విముక్తి పొందచ్చంటున్నారు నిపుణులు.