-
-
By Chowdary
Updated :
20 November 2025 06:05 PM
అందరికీ ఆరోగ్యస్పృహ పెరిగే సరికి... ఒకప్పుడు మన పూర్వికులు వాడిన మట్టి పాత్రల వినియోగం మళ్లీ మొదలైంది. అయితే, దీని ప్రయోజనాలు, ఉపయోగించే విధానం తెలియకుండా కొనేస్తే ఫలితం శూన్యం. అందుకోసమే మీకీ చిట్కాలు.
మట్టి పాత్రల్ని కట్టెల పొయ్యి మీదే కాదు, గ్యాస్ పొయ్యి మీద కూడా పెట్టి వండుకోవచ్చు. అయితే, ఇవి త్వరగా వేడెక్కుతాయి. ఒక్కసారిగా హీట్ అయితే భళ్లున పగిలిపోతాయి. ముందు నెమ్మదిగా కుండను చిన్న సెగ మీద ఉంచి మంటను పెంచుతూ ఉండాలి. ఆ తర్వాతే వంట ప్రారంభించాలి. పాత్ర వేడిగా ఉన్నప్పుడు చన్నీళ్లలో పెట్టకూడదు.
ఒకవేళ కొత్త మట్టిపాత్రను వాడాలనుకుంటే ముందు సీజనింగ్ చేయాలి. అంటే... ఒక రోజంతా నీళ్లలో నానబెట్టి తడి పోయాక లోపల, బయట వంటనూనె రాసి ఆరనివ్వాలి. ఆ తర్వాతే దాన్ని వినియోగించాలి.
ఈ పాత్రల్లో మాంసాహారం, పప్పులు వంటివాటిని కూడా వేగంగా ఉడికించొచ్చు. ఇందులోని ఆహారం కూడా చాలా సేపు వేడిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ వేడి చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి పోషకాలనీ కోల్పోదు.
మట్టి పాత్రల్లో వండేటప్పుడు వంటకు నూనె పెద్దగా అవసరం ఉండదు. దీనివల్ల ఒంట్లో కొవ్వు చేరదు. మట్టిపాత్రలు త్వరగా పగిలిపోతాయనే భయం అవసరం లేదు. వీటిని అమర్చే విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలాకాలం మన్నుతాయి.
మట్టిలో బి12తో సహా అనేక విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్... లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ తినే ఆహారంలో చాలా తక్కువగా ఉంటాయి. శరీరానికి ఎంతో అవసరమైన ఇవి మట్టి పాత్రల నుంచి తగినంతగా అందుతాయి. పైగా సన్నని మంటమీద నెమ్మదిగా ఉడకడం వల్ల, పదే పదే వేడి చేయాల్సి అవసరం ఉండదు. దాంతో ఆయా కాయగూరల్లోని పోషకాలేవీ వృథా పోవు. పాత్ర నిండా ఆవిరి పరచుకుని, అందులోనే మగ్గుతాయి కాబట్టి ఆరోగ్యానికీ మంచిది. పైగా రుచీ ఎక్కువే.
మట్టి పాత్రల్ని సబ్బుతో కడిగితే రసాయనాల్ని పీల్చుకునే ప్రమాదం ఉంది. బదులుగా బరకగా ఉండే ఇసుక, సున్నిపిండి, బూడిద, కుంకుడు రసం వంటివి వాడితే మేలు.