-
-
By Chowdary
Updated :
20 November 2025 06:02 PM
నడక మొదలుపెట్టినప్పటి నుంచి నడత నేర్చేవరకూ తల్లిదండ్రులే పిల్లలకు మార్గనిర్దేశకులు కావాలి. వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, పిల్లల విషయంలో ఉదాహరణగా నిలవాలి తప్ప, ఉదాసీనత పనికిరాదు. పిల్లల వయసును బట్టి మీ బాధ్యతలూ మారతాయి! అవి తెలుసుకుంటూ వాళ్లకు బంగారు భవిష్యత్తు ఇవ్వడమే చిన్నారులకు మీరిచ్చే బహుమతి.
పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు తొలి అడుగులు పడే కాలం ఇది. ఆడుకుంటూనే... తల్లిదండ్రులు ఏం చేస్తున్నారనేదానిపైన ఒక కన్నేసి ఉంచుతారు పిల్లలు. కాబట్టి వాళ్లకి మనమే మంచి నమూనా కావాలి.
నచ్చిన పదార్థాలనే పదేపదే తినాలనుకుంటారు. కుదరకపోతే మారాం, హఠం చేస్తారు. నచ్చజెప్పే ఓపిక లేక అడిగినవి పెట్టేస్తున్నారా? అలా చేయకండి. పిల్లలు నూడుల్స్ అడిగితే వాళ్లతో పాటుగా మీరూ అవే తినండి. తర్వాత మీరేది తింటారో వాళ్లనీ అది తినమనండి.
కచ్చితమైన ప్రవర్తనా నియమావళిని పాటించడానికి ఇష్టపడరు. అలాగని వదిలేస్తే ఇంకెప్పుడూ పాటించలేరు. కాబట్టి రోజూ నిర్దేశిత సమయానికే మేల్కోవడం, భోజనం చేయడం, చదువుకోవడం, నిద్రపోవడం లాంటివి... కుటుంబమంతా పాటించాలి.
వీరిలో అబ్జర్వేషనల్ లర్నింగ్ ఉంటుంది. స్నేహితులూ, చుట్టాలూ ఎదురుగా ఉన్నప్పుడు ఆదరాభిమానాలు చూపి, పక్కకి వెళ్లగానే వారిపై విమర్శలు గుప్పించడం లాంటివి పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయని మర్చిపోకండి.