-
-
By Chowdary
Updated :
20 November 2025 06:00 PM
మీ భాగస్వామిలో మీకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం గురించి వారితోనే నెమ్మదిగా చెప్పి చూడండి. అది మీకు ఎందుకు అంతగా ఇబ్బంది కలిగిస్తోంది? అనే విషయాన్ని వివరించండి. సున్నితంగా వారికి నచ్చచెబితే తప్పకుండా వారిలో మార్పు కనిపించే అవకాశాలుంటాయి. అలాగే వారి అలవాట్ల వల్ల మీరు ఎంత అసౌకర్యంగా ఫీలవుతున్నారు?ఎందుకు వాటి మీద అంతగా దృష్టి సారిస్తున్నారు? అనే అంశాలను కూడా వారికి సవివరంగా చెప్పండి. ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో వారిలో మార్పు రావచ్చు.
తగిన సలహాలివ్వండి..
ఎప్పట్నుంచో ఉన్న అలవాటుని మార్చుకోవడానికో లేదా పూర్తిగా మానుకోవడానికో కాస్త సమయం పట్టడం సహజం. ఈ క్రమంలో మీరు వారిని ప్రోత్సహించేలా అందుకు తగిన సలహాలు- సూచనలు అందించండి. ఆ అలవాటు మానుకోవడం వల్ల వారికి కలిగే ప్రయోజనాల గురించి సానుకూలంగా వారికి వివరించే ప్రయత్నం చేయండి. ఫలితంగా వారిలో ఎంతో కొంత మార్పు రాకపోదు.
హామీ ఇవ్వాలి..
జీవిత భాగస్వామితో ఇలాంటి అలవాట్ల గురించి చర్చించే క్రమంలో వారు మనకు ఉండే ఇబ్బందికరమైన అలవాట్ల గురించి కూడా ప్రస్తావించవచ్చు. అటువంటప్పుడు మీరు వాటిని ప్రతికూలంగా భావించకుండా మీ అలవాట్ల వల్ల వారికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్తపడతాననే హామీని వారికి ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారు కూడా వారికి ఉన్న అలవాట్లను మార్చుకోవడానికో లేదా పూర్తిగా మానుకోవడానికో ప్రయత్నిస్తారు. దంపతుల్లో ఏ ఒక్కరు సలహాలు, సూచనలు ఇచ్చినా మరొకరు మనస్ఫూర్తిగా స్వాగతించేందుకు సన్నద్ధంగా ఉంటేనే ఆ కాపురం సంతోషంగా ముందుకు సాగుతుంది. ఏమంటారు?