-
-
By Chowdary
Updated :
15 November 2025 01:32 PM
ఆఫీసు పనిలో తలమునకలై ఉన్న శ్వేతకు... అకస్మాత్తుగా స్వీటు తినాలన్న కోరిక. అలాగని తీపి తినడమేమీ తన బలహీనత కాదు. కానీ, ఆ భావనను తను ఎంతగా అదుపు చేసుకోవాలన్నా చేసుకోలేదట. తనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా 70 శాతంమంది మహిళలు ప్రతినెలా హార్మోన్లు, గట్బ్యాక్టీరియా, నిద్రలేమి... తదితర కారణాలతో షుగర్ క్రేవింగ్స్‌ని ఫీలవుతారట. మరి అవేంటో తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నించి చూడండి. బరువు నియంత్రణలోనే కాదు... ఆరోగ్యమూ మీ చేతిలో ఉంటుంది.
మహిళల్లో ల్యూటియల్ దశ తర్వాత ప్రొజెస్టరాన్ పెరిగి ఈస్ట్రోజన్ తగ్గుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచి సెరటోనిన్‌ను తగ్గిస్తుంది. ఈ మార్పులు ఆకలితో పాటు చక్కెర తినాలన్న కోరికనూ పెంచుతాయట. 50 శాతంమంది మహిళలకు పీరియడ్స్‌కి ముందు వారంలో షుగర్ క్రేవింగ్ తీవ్రంగా ఉంటుందని చెబుతున్నాయి అధ్యయనాలు.
ఏ పూట అయినా తినడం మానేస్తే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోతాయి. దాంతో శరీరం... తక్షణ శక్తి వనరుల్ని కోరుకుంటుంది. దీంతో స్వీట్ తినాలన్న కోరిక పెరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ప్రతి నాలుగు గంటలకోసారి ఏదైనా తింటే సరి.
స్రీలు మగవారికంటే రెండింతలు ఎక్కువగా ఆందోళనకు గురవుతారట. ఒత్తిడి ఒంట్లో కార్టిసాల్ స్థాయుల్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర, ఇన్సులిన్ లెవల్స్‌ని ప్రభావితం చేస్తుంది. దీంతో తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరుగుతుంది. అంతేకాదు, షుగర్ తాత్కాలికంగా డోపమైన్, సెరటోనిన్లను పెంచి మూడ్ మెరుగుపరుస్తుంది. ఒత్తిడి సెరటోనిన్‌ను తగ్గించి షుగర్ క్రేవింగ్స్‌ని పెంచుతుందట. యోగా, ధ్యానం వంటివాటితో స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు. ప్రయత్నించి చూడండి.
స్త్రీలకు నిద్రలేమి సమస్య ఎక్కువ. నిద్ర తక్కువైనప్పుడు గ్రెలిన్(ఆకలి హార్మోన్) పెరిగి లెప్టిన్(తృప్తి) తగ్గుతుంది. దీంతో చక్కెర తినాలన్న కోరిక ఎక్కువవుతుంది. అలానే మెగ్నీషియం, ఐరన్... వంటి కొన్ని పోషకలోపాలు కూడా తీపి పదార్థాలను ఇష్టంగా తినేందుకు తోడ్పడతాయి. ఇలాంటప్పుడు స్వీట్‌కి బదులు డార్క్ చాక్లెట్ తింటే సరి. చక్కటి నిద్రా పడుతుంది.
ఆకలి, తీపి తినాలన్న ఆసక్తికి... డీహైడ్రేషన్ కూడా కారణం కావొచ్చు. ఈ సమయంలో శరీరం లిక్విడ్స్ అవసరాన్ని సూచిస్తుంది. కానీ, మనసు మాత్రం తీపి తినమని కోరుకుంటుంది. అలాగని డైట్ సోడాలు తాగితే ఆకలి పెరగడమే కాదు... తీపి తినాలనీ అనిపిస్తుంది. బదులుగా కాసిని మంచినీళ్లో, నిమ్మరసమో తాగితే మీ సమస్య రెండు విధాలా పరిష్కారమవుతుంది.