-
-
By Chowdary
Updated :
20 November 2025 05:58 PM
⚛ ప్రతి ఒక్కరిలో బలాలు, బలహీనతలు ఉంటాయి. అయితే భార్యాభర్తలిద్దరి మధ్య పెద్ద గొడవైతే తప్ప ఒకరి బలహీనతలు/లోపాల్ని మరొకరు టార్గెట్ చేయరు. కానీ కొంతమంది తరచూ తమ భాగస్వామి బలహీనతలు, లోపాల్ని ఎత్తి చూపడమే పనిగా పెట్టుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడే కాదు.. నలుగురిలోనూ వారిని నిందిస్తుంటారు. పెళ్లైన కొత్తలో భాగస్వామిలో ఇలాంటి ప్రవర్తన కనిపిస్తే అనుమానించమంటున్నారు నిపుణులు.
⚛ భార్యాభర్తలు నాలుగ్గోడల మధ్య ఎలా ఉన్నా నలుగురిలో హుందాగా వ్యవహరించాలి.. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ భాగస్వామిని టార్గెట్ చేయాలని ఆలోచించే వారికి ఈ విషయాలేవీ పట్టవు. అందుకే నలుగురూ ఉన్నప్పుడు ఏదో ఒక మాట అనడం, అవమానించడం.. ఇలా మరోసారి వాళ్ల ముందు తలెత్తుకోకుండా చేస్తారు.
⚛ దంపతులు ఒకరితో ఒకరు సమయం గడపడంతో పాటు తమకంటూ కొంత వ్యక్తిగత సమయం కేటాయించుకోవడం ముఖ్యం. కానీ కొంతమంది భాగస్వామికి ఉన్న ఈ స్వేచ్ఛను కూడా హరిస్తుంటారు. వారి నిర్ణయాలు, స్నేహాలు, ఆర్థిక పరమైన అంశాలు.. ఇలా ప్రతి దాంట్లో కల్పించుకుంటూ వారి జీవితాల్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. ఇలా భాగస్వామిని మానసికంగా హింసిస్తుంటారు.
⚛ వివాహబంధం శాశ్వతమవ్వాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం ముఖ్యం. కానీ కొన్ని జంటల్లో పెళ్లైన కొన్నాళ్లకే ఇది కొరవడుతుంటుంది. భాగస్వామితో తరచూ అబద్ధాలాడడం, చేసిన వాగ్దానాల్ని విస్మరించడం.. ఇవీ అనుబంధాన్ని దెబ్బతీసే అంశాలే అంటున్నారు నిపుణులు.
⚛ సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ భాగస్వామికి తోడుగా ఉన్నప్పుడే ఆ అనుబంధం శాశ్వతమవుతుంది. కానీ కొందరు అవతలి వారు బాధల్లో ఉన్నప్పుడు వాళ్లను అలాగే వదిలేస్తుంటారు. పైగా వాళ్ల బాధ చూసి లోలోపల సంతోషించే వారూ లేకపోలేదు. ఇలా భాగస్వామి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వకపోవడం కూడా అనుబంధంలో విషపూరితమైన సంకేతమే అంటున్నారు నిపుణులు.
⚛ ఏదేమైనా తాము అనుకున్నదే జరగాలన్న తత్వం కొంతమందిలో ఉంటుంది. ఈ క్రమంలో భాగస్వామి మనోభావాల్ని కూడా లెక్క చేయరు. తాము సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నది మాత్రం చూసుకుంటారు. వివాహ బంధంలో ఇదీ మంచి సంకేతం కాదంటున్నారు నిపుణులు.
⚛ భార్యాభర్తలిద్దరిలో ఎవరు కెరీర్, ఉద్యోగాల్లో రాణిస్తున్నా.. మరొకరు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అనుబంధంలో అనుక్షణం విషం చిమ్మాలని భావించే వాళ్లు తమ భాగస్వామిపై అసూయ పడుతుంటారని నిపుణులు అంటున్నారు.
⚛ ఇలా వారి ప్రవర్తనతో మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడం కాదు.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా సంతోషంగా సమయం గడపకుండా చేస్తుంటారు. ఇదీ ఓ రకమైన మానసిక హింసే అంటున్నారు నిపుణులు.