-
-
By Chowdary
Updated :
20 November 2025 05:57 PM
పెళ్లి కుదిరాక ఒకరి గురించి మరొకరు మరింత వివరంగా తెలుసుకోవడం వల్ల పెళ్లి తర్వాత దాంపత్య జీవితంలో ఎలాంటి కలతలు రాకుండా ఉంటాయి. కాబట్టి కాబోయే భాగస్వామి ఎలాంటి వారు? తన అభిరుచులు, ఇష్టాయిష్టాలు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనా?.. మొదలైన వివరాలన్నీ ముందుగానే తనను అడిగి తెలుసుకోవడం; మీ గురించి కూడా మీ కాబోయే భాగస్వామికి చెప్పడం.. మంచిది. ఫలితంగా పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి కీచులాటలకు తావుండదు. అలాగే పెద్దలు కూడా ఒకరి కుటుంబం గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవడం అవసరం.వాటికి సిద్ధమేనా?
పెళ్లికి ముందు వరకు ఎంత స్వేచ్ఛగా జీవితాన్ని గడిపినా.. పెళ్లి తర్వాత మాత్రం కొన్ని అదనపు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి పనులైనా, బాధ్యతలైనా ఆనందంగా స్వీకరిస్తాం అనే ఆత్మవిశ్వాసం మీలో ఉందో లేదో పెళ్లికి ముందే బేరీజు వేసుకోవడం మంచిది. లేదంటే పెళ్లి తర్వాత దంపతుల మధ్య, ఇరు కుటుంబాల మధ్య లేనిపోని అపార్థాలు, గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఉమ్మడిగానా? విడిగానా?
ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. చాలామంది వివిధ కారణాల రీత్యా పెళ్లి కాగానే కుటుంబం నుంచి బయటికి వచ్చేసి వేరే కాపురం పెడుతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఉమ్మడి కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. మీకు ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేకపోతే.. పెళ్లి తర్వాత అది పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా కాబోయే భాగస్వామి అభిప్రాయం ఎలా ఉందో కనుక్కోవడం మంచిది. ఫలితంగా ఇద్దరి మధ్య.. అలాగే రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.
సంతానం విషయంలోనూ..
కొంతమంది పెళ్లి అవగానే సంతానం గురించి ఆలోచిస్తే.. మరికొంతమంది మాత్రం పెళ్లి తర్వాత సంవత్సరమో, రెండేళ్లో గ్యాప్ తీసుకుంటారు. అయితే ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకే మాటపై నిలబడడం మంచిది. ఈ విషయం గురించి కూడా పెళ్లికి ముందే భాగస్వామితో చర్చించాలి. ఇద్దరికీ ఒప్పందం అంగీకారమైతేనే ముందుకెళ్లడమో.. లేదంటే ఒకరినొకరు ఒప్పించుకోవడమో చేయాలి. ఇలాంటి విషయాల్లో దాపరికాలుంటే మాత్రం తర్వాత గొడవలు, అపార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది.
వృత్తిపరంగా..
ఈ రోజుల్లో చాలామంది యువత ఇద్దరికీ ఒకే రకమైన ఉద్యోగం ఉండేలా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. పెళ్లి అనంతరం వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఒకరినొకరు ఇష్టపడతారు.. కానీ వారు చేసే ఉద్యోగాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి.
ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ కలిసి ఏకాంతంగా మాట్లాడుకోవడం, ఉద్యోగం విషయంలో ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం.. వంటివి చేయాలి. తద్వారా ఎవరో ఒకరు సర్దుకుపోవడమా? లేదంటే కాబోయే భాగస్వామి ఇష్టాన్ని గౌరవించడమా?.. అనేది ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రావడం మంచిది. ఫలితంగా పెళ్లి తర్వాత వృత్తి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకుండా జాగ్రత్తపడచ్చు.