-
-
By Chowdary
Updated :
20 November 2025 05:56 PM
సాధారణంగా మనకు పరిచయమైన, మనకు నచ్చిన వ్యక్తుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాం. అలాంటిది మన జీవితంలో సగభాగమైన భాగస్వామి గురించి తెలుసుకోకపోతే ఎలా? కాబట్టి ఇతరుల గురించి కాసేపు పక్కన పెట్టి భాగస్వామికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవడంలో శ్రద్ధ చూపాలి. ఇందుకు పెళ్లయిన తొలి రోజులే మంచి సమయం. అయితే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కొన్ని రోజుల్లో కుదరకపోవచ్చు. అందుకే పెళ్లయిన తొలి ఏడాది మీ భాగస్వామి మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ల అభిరుచులేంటి? ఇష్టాయిష్టాలేంటి? వారి జీవన విధానాలేంటి? మొదలైన విషయాలన్నీ వారి ప్రవర్తన ఆధారంగా గమనించడం లేదంటే ఎక్కువ సమయం కేటాయించి వారితో ప్రేమగా మాట్లాడడం.. వంటివి చేయాలి. ఫలితంగా భాగస్వామి గురించి, వారి స్వభావం గురించి ఓ అవగాహన వస్తుంది.
దాచొద్దు..
‘దంపతుల మధ్య దాపరికాలుండద్దు..’ అంటారు పెద్దలు. కానీ పెళ్లయిన కొత్తలో కొంతమంది దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల అన్ని విషయాలు పంచుకోలేకపోవచ్చు. ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎదుటి వారికి చెప్పడానికి కాస్త తడబడుతుంటారు. ఇందుకు ముఖ్యంగా ‘ఈ విషయం చెబితే వారు ఏమనుకుంటారో ఏమో? ఇది కూడా ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా.. అని అనుకుంటారేమో..’ అనే మొహమాటాలు కారణమవుతాయి. అలాగని వారితో పంచుకోకపోతే ఆ దూరం అలాగే ఉండిపోతుంది. కాబట్టి పెళ్త్లెనప్పటి నుంచే దంపతులు ఎలాంటి విషయాలనైనా ఒకరికొకరు చెప్పుకోవడం, అందులోని క్లిష్ట సందర్భాల్ని కలిసి ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా ముందు నుంచీ చేయడం వల్ల పోను పోను భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలూ లేకుండా వారి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. ఇది ఎన్నేళ్లయినా తరగకుండా అలాగే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిర్లక్ష్యం చేయొద్దు..
భార్యాభర్తల బంధం అంటే భారం కాదు.. బాధ్యత. అయితే పెళ్త్లెన కొత్తలో ఒకరిపై మరొకరికి అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న అలకలు, గొడవలు సహజం. అయితే ఇలాంటి సందర్భాల్లో మీ భాగస్వామి ఉన్న పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాకాకుండా ఆ కోపాన్ని అలానే కొనసాగిస్తే.. ఇద్దరి మధ్య దూరం రెట్టింపవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో కోపతాపాలకు సెలవిచ్చి మరీ భాగస్వామికి అండగా ఉన్నారనుకోండి.. వారు కూడా ఎంతో సంతోషిస్తారు. అలాగే మీపై మరెంతగానో ప్రేమ పెరిగిపోతుంది.