-
-
By Chowdary
Updated :
15 November 2025 01:31 PM
రేణుక, కార్తీక్‌లకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తారు. కలిసే ఆఫీసుకి వెళ్లి వస్తారు. వాళ్ల మధ్య ఎలాంటి వాదనలూ, గొడవలూ లేవు. ఇంటి పనులు, బాధ్యతలు కలిసే పంచుకుంటారు. అన్నీ సరిగ్గానే ఉన్నట్లు అనిపిస్తున్నా ఏదో తెలియని నిశ్శబ్దం. ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా తెలియని దూరం. దీన్నే ‘ఫంక్షనల్ లోన్లీనెస్’ అంటున్నారు నిపుణులు. దాంపత్యంలో కొన్ని రోజుల తర్వాత భావోద్వేగ సంబంధాలు కొరవడటంతోనే ఇది ఏర్పడుతుందట. మరి ఇద్దరిమధ్యా ఈ తెరలు తొలగిపోవాలంటే కలిసి బాధ్యతల్నే కాదు, భావోద్వేగాలనూ పంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు.ఇందుకు ఏంచేయాలంటే...
రోజులో ఓ పది నిమిషాలు మీకోసం సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ టైమ్‌లో మీ ఇద్దరికి సంబంధించిన విషయాలు తప్ప వేరే వాటికి చోటివ్వొద్దు.
ఆ పది నిమిషాలు మీ జీవితంలో జరిగిన చిన్నచిన్న ఆనందాలను ఒకసారి గుర్తుచేసుకోండి. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న మొదటి మాట, మొదటి ప్రయాణం ఈ బిజీలైఫ్‌లో పడి వాటిని మరిచిపోతున్నామే కానీ, తరచి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి జ్ఞాపకాలు ఎన్ని ఉండవు చెప్పండి.
రొటీన్‌గా లైఫ్‌ని గడిపేయకుండా వీకెండ్‌ని కాస్త కొత్తగా ప్లాన్ చేసుకోండి. సరదాగా బయటికెళ్లండి. ఫోన్లు పక్కన పెట్టి పదినిమిషాలు మనసువిప్పి మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. ఒకరి భావాలను మరొకరు పంచుకుంటే మనసు తేలికపడి, ఇద్దరిలో ఏర్పడిన ఒంటరితనం ఇట్టే మాయం అయిపోతుంది.
మనసులో మాట చెప్పుకొనేందుకు సమయం కేటాయించాలి. ఇరువురి భావాలు, ఆలోచనలు, సరదాలు, సంతోషాలు ఒకరికొకరు పంచుకోండి. మొత్తంగా మనసూ, మాట ఒక్కటైతే ఎలాంటి సమస్యలూ ఉండవు.