-
-
By Chowdary
Updated :
20 November 2025 05:54 PM
నేర్చుకోనివ్వండి: ఏ కష్టం తెలియకూడదని పిల్లల కాళ్లదగ్గరకే అన్నీ తెచ్చిపెడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. ఇలా చేస్తే వారంతట వారు ఏ పనైనా చేయాల్సి వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే, చిన్నప్పటి నుంచే సీసాలోకి నీళ్లు నింపుకోవడం, పుస్తకాలు, చెప్పులు... సర్దిపెట్టుకోవడం, ఇంటిపనుల్లో సాయం చేయడం వంటివి అలవాటు చేయండి. ఇవన్నీ మొదట కష్టంగా ఉన్నా... ఏ పనైనా సమర్థంగా చేసుకోగల సామర్థ్యం వారికి అలవడుతుంది.
సమయపాలన: వ్యక్తిగత జీవనశైలిలో క్రమశిక్షణ అవసరం. ముఖ్యంగా సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడండి. చదువుకోవడానికి టైం టేబుల్ని అనుసరించినట్లే... రోజువారీ పనుల కోసమూ టైమ్‌ని నిర్దేశించండి. టైమ్‌కి భోజనం చేయడం, రాత్రి త్వరగా నిద్రించడం, ఉదయాన్నే త్వరగా లేవడం, వ్యాయామం... వంటి అన్నింటికీ ఓ పద్ధతిని అలవరిస్తే సరి. మీరు ఇది చెయ్యి... అది చెయ్యి అంటూ వెంటపడాల్సిన అవసరం ఉండదు.
బాధ్యత: పిల్లలు ఏ పనిచేసినా దానికి సంబంధించిన బాధ్యత వారే తీసుకునేలా అలవాటు చేయాలి. అయితే, మొదట ఈ గుణాన్ని మీరు అలవరుచుకోవాలి. మిమ్మల్ని చూసి చిన్నారులు అనుసరిస్తారు. ఒకవేళ ఎందులో అయినా పొరపాటు జరిగినా అరవడమో, తిట్టడమో చేయకుండా... సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. ఇతరుల సాయానికి కృతజ్ఞత చెప్పడం, తోటివారినీ కలుపుకొని వెళ్లడం, చేయలేని పనులకు క్షమించమని అడగడం వంటివీ చిన్నప్పటి నుంచే అలవరచాలి.
భావోద్వేగాల నియంత్రణ: తల్లిదండ్రులను చూసే పసివాళ్లు నేర్చుకుంటారు. పట్టలేని కోపం, బాధ, ఏడుపు వంటివి మనల్ని అదుపు తప్పేలా చేస్తాయి. దానివల్ల కలిగే నష్టాలూ అధికమే. అలాంటి ఉద్వేగాలు ఎదురైనప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి అంకెలు లెక్కపెట్టడం, మౌనంగా ఉండటం, ధ్యానం, పుస్తకం రాయడం వంటి ప్రయత్నాలు... ఫలితాన్నిస్తాయి. వారిని చేసి చూడమనండి. క్రమంగా అలవరుచుకుంటారు.