-
-
By Chowdary
Updated :
20 November 2025 10:31 AM
నల్గొండ, చౌటుప్పల్‌గ్రామీణం: అక్రమ పద్ధతిలో భూమిని పొందేందుకు చేసిన ఫోర్జరీ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్ బుధవారం వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన ప్రకారం... చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో సర్వే నంబరు 42లో తెల్లపాటి భూషయ్య పేరిట 3.05 ఎకరాల భూమి ఉంది. భూషయ్య, అతని కుటుంబం నలభై ఏళ్లుగా గ్రామంలో ఉండటం లేదు. సుమారు రూ.12 కోట్లకుపైగా విలువైన ఈ భూమిని కాజేయాలని భారత రాష్ట్ర సమితి మండల అధ్యకుడు గిర్కాటి నిరంజన్‌గౌడ్ కుట్ర పన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామానికి చెందిన భోగినేని మోహన్రావుకి భూషయ్య సాదాబైనామా కింద 1994 జూన్ 15న విక్రయించినట్లు పత్రాలను సృష్టించాడు.
అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకం సంపాదించి భూమిని తనపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానికుడైన ఫక్కీరు ప్రభాకర్‌రెడ్డి... కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. అధికారులు పూర్తి వివరాలు సేకరించగా... ఇందులో అక్రమాలు జరిగాయని, నిరంజన్‌గౌడ్ పలువురు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడని తేలింది. దాంతో ఈ వ్యవహారంపై ప్రస్తుత తహసీల్దార్ వీరాబాయి చౌటుప్పల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్రమ పద్ధతిలో భూమిని పొందిన మోహన్‌రావు, నిరంజన్గౌడ్లపై, సహకరించిన రెవెన్యూ అధికారి రాజేశ్, మోహన్‌రావును నిరంజన్‌కు పరిచయం చేసిన అత్తాపురం నరేందర్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను రామన్నపేట కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.