-
-
By Chowdary
Updated :
19 November 2025 02:40 PM
జడ్చర్ల, జడ్చర్ల పట్టణం, న్యూస్‌టుడే: స్పిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ జరిగి పత్తికి నిప్పంటుకొని ఇద్దరు కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి పరిధిలోని శ్రీసలాసర్ బాలాజీ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్(జిన్నింగ్, స్పిన్నింగ్, ఫ్యాబ్రిక్)లో మంగళవారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మరో అరగంటలో షిఫ్టు పూర్తయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. ఉదయం షిఫ్టులో విధుల్లో ఉన్న కార్మికులు స్పిన్నింగ్ తర్వాత మిగిలిపోయిన పత్తిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అక్కడ దాదాపు 9 మంది విధుల్లో ఉన్నారు. వీరు పనిచేస్తున్న సమయంలోనే ఎగ్జాస్ట్ ఫ్యాను వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి పత్తికి నిప్పంటుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడున్న కార్మికులు బయటకు వచ్చేలోపే మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. బిహార్‌కు చెందిన హరేందర్(24), ఒడిశాకు చెందిన పపూనిశెట్టి(28) మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమీపంలో ఉన్న మరో ఇద్దరు కార్మికులు శంబుశెట్టి, దేవరాజ్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మిగతా ఐదుగురు తప్పించుకున్నారు. గాయపడిన వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదు అగ్నిమాపక శకటాలతో రాత్రి 8 గంటల వరకు మంటలు అదుపు చేశారు. మిల్లులో వివిధ షిఫ్టుల్లో సుమారు వెయ్యి మంది కార్మికులు పని చేస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక శకటాలు రావడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.