-
-
By Chowdary
Updated :
19 November 2025 02:39 PM
హైదరాబాద్: ‘ఏమీ లేనివాణ్ని.. ఎవ్వరితోనూ సంబంధాల్లేవు. బంధాలు, బంధుత్వాలకు దూరంగా ఉన్నా. చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు’ అంటూ మూడు నెలల క్రితం పోలీసులకు సవాల్ విసిరిన ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి ఎలియాస్ ప్రహ్లాద్‌కుమార్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నాడు. క్రిమినల్ మైండ్‌తో మాస్టర్‌మైండ్‌గా ఎదిగిన ఇతడి గురించి రిమాండ్ రిపోర్టు, దర్యాప్తులో కీలక అంశాలు పొందుపరిచారు. ఏక్నిరంజన్గా మారిన ఇమంది రవి పైరసీ కింగ్‌పిన్‌గా ఎదిగిన తీరుపై వివరాలివీ..
ప్రహ్లాద్‌కుమార్ పేరుతో పాన్‌కార్డు..
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి చిన్న అప్పారావు కుమారుడు రవి. ప్రేమ వివాహం విఫలం కావడంతో కూకట్‌పల్లిలో ఒంటరిగానే ఉంటున్నాడు. తాను హైదరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ కంపెనీతో నెలకు రూ.లక్ష ఆదాయం వచ్చేది. పైరసీ సినిమాలతో నెలకు రూ.11 లక్షలు వస్తుండడంతో ఐటీ కంపెనీ మూసివేశాడు. వన్ఎక్స్ బెట్, వన్ విన్ బెట్టింగ్ యాప్స్ నుంచి భారీగా ప్రకటనలు తెచ్చుకున్నాడు. ఆరేళ్లలో రూ.కోట్లు కూడబెట్టాడు. దేశ, విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశాడు. ప్రహ్లాద్‌కుమార్ పేరుతో పాన్‌కార్డు సంపాదించాడు. దాని ద్వారానే బ్యాంకు ఖాతాలు, ఆన్లైన్లో విదేశాల నుంచి క్రిప్టో, బిట్‌కాయిన్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తూ తానెవరో తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. భారత పౌరసత్వం రద్దు చేసుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పౌరసత్వం తీసుకున్నాడు. తన వ్యాపార భాగస్వాములు కరేబియన్ దీవుల్లో ఉండటంతో అక్కడే పౌరసత్వం తీసుకున్నట్టు పోలీసులకు చెప్పాడు. ఒకే ప్రాంతంలో ఉంటే పట్టుబడే అవకాశం ఉందనే భయంతో రవి తరచూ వేర్వేరు చోట్లకు తిరుగుతుండేవాడు. యూరప్ దేశాలంటే ఇష్టపడే అతడు 2 నెలలకో దేశం చుట్టొచ్చేవాడు. అతడి వద్ద లభించిన పాస్‌పోర్టు ఆధారంగా ఇప్పటి వరకు 10-11 దేశాలకు వెళ్లొచ్చినట్టు గుర్తించారు. ఆయా దేశాల్లోని బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాడు. ఐబొమ్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకొని.. సెప్టెంబరు 3న విదేశాలకు వెళ్లాడు. ఫ్రాన్స్‌లో 2 నెలలు ఉన్నాక.. ఈ నెల 14న ఉదయం కూకట్‌పల్లిలోని సొంతింటికి చేరి పోలీసుల వలకు చిక్కాడు.
బాత్రూమ్లో ల్యాప్‌టాప్ దాచి..
డీసీపీ కవిత, ఇన్స్పెక్టర్లు నరేశ్, మధుసూదన్‌రావు బృందం నిందితుడి ఇంటి వద్దకెళ్లారు. తలుపులు తెరవమని ఎంతగా పిలిచినా స్పందన కరవైంది. సుమారు 2 గంటలపాటు ఇంటి వద్దే ఎదురు చూసిన పోలీసులు చివరగా గట్టిగా తలుపులపై కొట్టడంతో రవి బయటకు వచ్చాడు. ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు మూటగట్టి ఉండటాన్ని పోలీసులు గమనించారు. పారిపోయేందుకు పథకం వేసినట్టు గుర్తించారు. బాత్రూమ్లో ల్యాప్‌టాప్, అల్మారాలో సెల్‌ఫోన్ గుర్తించారు. 35 బ్యాంకు ఖాతాల్లో లభించిన ఆధారాలతో రూ.20 కోట్లు సంపాదించినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు.