-
-
By Chowdary
Updated :
20 November 2025 10:25 AM
దిల్లీ/ఢాకా: తన తల్లిని హత్య చేయాలన్న కుట్ర జరిగిందని, అయితే ఆమెను సకాలంలో భారత్ రక్షించిందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ తెలిపారు. ఇందుకు తాను మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. విద్యార్థుల ఉద్యమం కారణంగా గతేడాది ఆగస్టు 5న బంగ్లా ప్రధాని పదవికి రాజీనామా చేసి హసీనా భారత్కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తన తల్లిని చంపేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారని, భారత్ రక్షించిందని వాజేద్ అన్నారు. తన తల్లికి బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ ఇటీవల విధించిన మరణశిక్ష రాజ్యాంగ విరుద్ధం, అక్రమమని పేర్కొన్నారు.
‘‘భారత్ ఎల్లప్పుడూ మంచి మిత్రదేశంగా ఉంది. సంక్షోభ సమయంలో నా తల్లి ప్రాణాలు కాపాడింది. ఆమె (హసీనా) బంగ్లాదేశ్ వీడకపోయి ఉంటే మిలిటెంట్లు ఆమె హత్యకు కుట్రలు చేసేవారు. నా తల్లి ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని మోదీ ప్రభుత్వానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. అప్పగింత జరగాలంటే న్యాయ ప్రక్రియను అనుసరించాలి. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన ప్రభుత్వం ఉంది. నా తల్లిని దోషిగా నిర్ధారించేందుకు, విచారణను త్వరగా ముగించేందుకు చట్టాలను సవరించారు. పార్లమెంటు అనుమతి లేకుండా చట్టాలను సవరించలేం. న్యాయవాదులను పెట్టుకునేందుకు కూడా నా తల్లిని అనుమతించలేదు. విచారణకు ముందే 17 మంది న్యాయమూర్తులను తొలగించి ధర్మాసనంలో ఎలాంటి అనుభవం లేని కొత్త జడ్జిలను నియమించారు. వారికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి’’ అని సాజిబ్ వాజేద్ అన్నారు. లష్కరే తయ్యిబా ఉగ్రవాదుల అడ్డాగా బంగ్లాదేశ్ మారిందని తెలిపారు.ఈ ఉగ్రవాద సంస్థకు యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అండదండలందిస్తోందని ఆరోపించారు.