-
-
By Chowdary
Updated :
19 November 2025 11:47 AM
వాషింగ్టన్: ప్రముఖ పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గి హత్య పూర్వరంగంలో ఏర్పడిన ఉద్రిక్తతల అనంతరం అమెరికా-సౌదీ సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. 2018 తర్వాత సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్) మొదటిసారిగా శ్వేత సౌధానికి విచ్చేశారు. ఆయనకు ట్రంప్ అదిరిపోయేలా ఆతిథ్యం ఇచ్చారు. సౌదీ అరేబియాకు అత్యాధునిక ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్ జెట్ల విక్రయాన్ని ఆమోదిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘అవును. మేము ఎఫ్-35లు అమ్మబోతున్నాం’ అన్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాలు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే యుద్ధ విమానాల అమ్మకంపై అమెరికా అధికారుల్లో కొంత ఆందోళన ఉంది. సౌదీ-చైనా సంబంధాలు ఇటీవల బలపడుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమాన సాంకేతికత చైనా చేతుల్లో పడే అవకాశముందని భావిస్తున్నారు.
జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్య వివాదం చాన్నాళ్లుగా అమెరికా-సౌదీల మధ్య అగ్గిరాజేస్తోంది. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చివరిసారి 2018లో వైట్‌హౌస్‌కు వచ్చినప్పుడు ఇదే అంశంపై వాడీవేడీ చర్చలూ జరిగాయి. ఖషోగ్గీ హత్య ఆపరేషన్‌లో బిన్‌సల్మాన్ హస్తం ఉండొచ్చని అప్పట్లో అమెరికా నిఘా వర్గాలు అంచనావేశాయి. సౌదీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఏడేళ్ల తర్వాత అలాంటి భావనలు తొలగిపోయాయని ట్రంప్ భావిస్తున్నారు.