-
-
By Chowdary
Updated :
26 November 2025 11:30 AM
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త, తత్వబోధకుడు వీరబ్రహ్మేందులు. పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయన. ఆ బోధనలు ప్రజల పాలిట దైవవచనాలు. బాల్యంలోనే కాళికాదేవిని పూజించి.. స్తుతిగేయాలు రచించిన మహాభక్తుడు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది, లోకంలో ఆరాధ్యనీయుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు.
సామాన్య ప్రజానీకంలో
‘బ్రహ్మంగారు’గా ప్రసిద్ధులైన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అక్షరజ్ఞానం లేనివారికి సైతం ఆత్మజ్ఞానాన్ని బోధించిన వేదాంతి. మతాలు, మనుషుల మధ్య సంఘర్షణల్ని రూపుమాపి, సామరస్యాన్ని పెంచాలని తపించిన సంస్కరణాభిలాషి. వీరబ్రహ్మం అనగానే అందరి మనసుల్లో మెదిలేది ‘కాలజ్ఞానం’. నోస్ట్రడామస్, మదర్ షిప్టన్ వంటి పాశ్చాత్యుల్లా.. దక్షిణాది మహాజ్ఞానులు విద్యారణ్య, చెన్నబసవల్లా కాలజ్ఞానాన్ని చెప్పిన త్రికాలవేది వీరబ్రహ్మేంద్ర స్వామి. జ్ఞానిగా, యోగిగా, గృహస్థ సాధకుడిగా, విరాగిగా బ్రహ్మంగారు భక్తుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సర్వసంగపరిత్యాగులకే కాదు సాంసారిక జీవనంలో కొనసాగుతున్నవారికి కూడా సద్గురువై దారిచూపారు. ‘మతాల్లో తప్పుల్లేవు! ఆచరించే మనసుల్లోనే దోషాలున్నాయి’ అని ఘంటాపథంగా చాటారు. మత నియమాల కన్నా మానవ విలువలకే ప్రాధాన్యం ఇచ్చారు. బ్రహ్మంగారు మఠాలు స్థాపించారు. పారమార్థిక ప్రవచనాలు, చైతన్యపూరిత రచనలతో జనావళిని జాగృతం చేశారు. ఆయన కాలజ్ఞానానికే పరిమితం కాదు. నిరాడంబర తపోజీవనం, కఠోర సాధన, ధ్యానకౌశలం, సామాజిక సంస్కరణ, తత్త్వబోధ, మత సామరస్యం, ధార్మిక రచనలు ఇలా ఆయనలో ఎన్ని కోణాలో!