-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 06:36 PM
చిత్తూరు : ఈ చిత్రంలో దివ్యాంగుల మధ్య అచేతనంగా నేలపై పడుకున్న 16 ఏళ్ల యువతి పేరు సుశీల. గుడిపాల మండలం చిత్తపార.. పుట్టిన వారంలోనే కాళ్లు చేతులు పనిచేయకపోవటంతో దివ్యాంగురాలైన తన తల్లి చిన్నారిని పోషించలేనని ఆసుపత్రిలోనే ఎవరికీ చెప్పకుండా వదిలి వెళ్లిపోయింది. దీంతో సుశీల అమ్మమ్మ రాము చేరదీసి కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. కనీసం ఆకలి వేస్తుందని, దప్పిక తీర్చాలని చెప్పలేదు. అవ్వ రాము, తాత ధర్మగౌడు వృద్ధులు. ఈ ముగ్గురే ఆ ఇంట్లో ఉంటున్నారు. వందశాతం దివ్యాంగురాలైన సుశీలకు ప్రస్తుతం రూ.6 వేల పింఛను అందుతోందని, రూ.15 వేల పింఛను కోసం అధికారులకు విన్నవించేందుకు మనవరాలితో కలిసి అష్టకష్టాలు పడి బుధవారం చిత్తూరుకు చేరుకుంది. పీవీకేఎన్ కళాశాల మైదానంలో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేసేందుకు ముందస్తుగా వివరాల నమోదు చేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది తెలియని వృద్ధురాలు మనవరాలితో వచ్చి పింఛను కోసం అధికారుల వద్దకు తిరుగుతూ కనిపించింది. ఇది పింఛను పెంచే కార్యక్రమం కాదని తెలియటంతో ఊసూరుమంది. ఆ యువతికి వీల్‌ఛైర్ అవసరమని కూడా గుర్తించలేని దీనస్థితి వారిది. చివరకు అక్కడున్న తోటి దివ్యాంగులు సుశీలకు వీల్‌ఛైర్ లేదని తెలుసుకుని దరఖాస్తు చేయించారు.