-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 06:27 PM
కావలి, న్యూస్‌టుడే: తమ ఇళ్లను ఇక్కడే ఉంచి భూములు వరకే సేకరిస్తామంటే ఒప్పుకొనేది లేదని కావలి మండలం చెన్నాయపాలెం గ్రామ రైతులు స్పష్టం చేశారు. పునరావాస ప్రాంతానికి తరలించే ప్యాకేజీకి అయితే సహకరిస్తామన్నారు. బుధవారం జిల్లా సంయుక్త కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గ్రామంలో భూసేకరణపై నిర్వహించిన సభలో తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఎకరాకు రూ.20లక్షల ధర అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గిట్టుబాటు కాదన్నారు. బీపీసీఎల్ కంపెనీ వచ్చాక తాము స్థానికంగా నివసించాలంటే కష్టతరమన్నారు. ముందుగానే పునరావాస విధానంలోకి తమ గ్రామాన్ని మార్చాలంటూ డిమాండ్ చేశారు. అందరూ పంటలసాగుతోపాటు సముద్రంలో చేపలవేటకు వెళుతున్నారన్నారు. ఆ కంపెనీ వచ్చాక ఉపాధికి గండిపడుతుందన్నారు. తమ భూములు సేకరించకుండానే గోడ నిర్మించేందుకు సదరు కంపెనీ ప్రణాళిక రూపొందించుకోవడాన్ని ఉద్దేశించి తప్పుబట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సమావేశంలో ఏపీ మారిటైంబోర్డు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎన్.రాజశేఖర్, ఆర్డీవో ఎం.సన్నీవంశీకృష్ణ, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, గ్రామ నాయకులు ప్రసాద్‌యాదవ్, శ్రీనివాసులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.