-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 06:19 PM
ఆత్మకూరు, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆత్మకూరులో జరిగిన అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో 1,95,866 మంది రైతులకు సంబంధించిన రూ. 130.20 కోట్ల నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రెండో విడత నిధులు జమ చేసినట్లు వివరించారు. సోమశిల హైలెవల్ కాలువ పూర్తికి, ఆత్మకూరులో ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి కృషి చేస్తామన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అమలు చేశారని వివరించారు. జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు మంత్రి పురపాలక కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆర్డీవో పావని, జేడీఏ సత్యవాణి, కిమ్స్ ఈడీ గిరినాయుడు, అధికారులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.