-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 06:13 PM
ముదినేపల్లి, న్యూస్‌టుడే: అన్నదాత సుఖీభవ అద్భుత కార్యక్రమమని, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ముదినేపల్లిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన జిల్లాస్థాయి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాట్సాప్‌ను ఉపయోగించి సాంకేతికతో రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకొనే అవకాశం కల్పించామన్నారు. 50 వేల టార్పాలిన్లు రైతులకు పూర్తి రాయితీపై ఇస్తున్నామని, ఏ సమస్య వచ్చినా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని కాలువలను రూ.3 కోట్లతో ప్రక్షాళన చేశామన్నారు. అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, రాయితీ డ్రోన్లను పరిశీలించారు. డిజిటల్ స్క్రీన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలను వారు రైతులతో కలిసి వీక్షించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఢిల్లీరావు, కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి జిల్లాలో 1,60,968 మంది రైతులకు రూ.106.23 కోట్ల చెక్కును అందించారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఏడీఏ జి.వెంకటమణి పాల్గొన్నారు.