-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 05:28 PM
పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కళా రంగంలో 50 ఏళ్లు దాటిన వ్యక్తుల అభిరుచులు, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ముంబయికి చెందిన ఖయాల్ సంస్థ ఏటా ‘50 అబౌ 50’ పేరిట పోటీలు నిర్వహిస్తుంటుంది. ఈనెల 15, 16 తేదీల్లో ముంబయిలోని గోరేగావ్‌లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో నగరంలోని కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన సువర్ణ దత్తు(55) పాల్గొని కూచిపూడి నృత్యం కేటగిరీలో టాప్-10లో నిలిచారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులకు నృత్యం, సంగీతం, యోగా, వంట చేయడం, పాటలు పాడటం అంశాల్లో గ్రాండ్ ఫినాలే పోటీలు నిర్వహించారు. కూచిపూడి నృత్యంలో సువర్ణ దత్తు టాప్-10లో నిలిచారు. ఆమెకు నిర్వాహకులు జ్ఞాపికతోపాటు రూ.10వేల నగదు, ధ్రువపత్రం అందజేశారు. ‘చిన్న వయసులో కూచిపూడి నేర్చుకోవాలని అనుకున్నా ..సాధ్యపడలేదు. పెళ్లయిన తర్వాత పిల్లలు, వారి చదువులతో తీరిక దొరకలేదు. చివరికి 38ఏళ్ల వయసులో కూచిపూడి నృత్యం నేర్చుకున్నా.. ఆ కళను నలుగురికి పంచాలనే ఉద్దేశంతో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నా. 50ఏళ్లు దాటిన వ్యక్తుల్లో ప్రతిభను బయటకు తీయడానికి ఖయాల్ సంస్థ పోటీలు నిర్వహిస్తుందని తెలుసుకుని దరఖాస్తు చేశా. పోటీల్లో పాల్గొని, నాలోని కళను ప్రదర్శించడం గొప్ప అనుభూతిని ఇచ్చింది’ అని సువర్ణ దత్తు తెలిపారు.