-
-
By LALAM NARESH
Updated :
20 November 2025 05:17 PM
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మెట్ట ప్రాంతాల్లో రబీ సీజన్లో శనగ, మొక్కజొన్న సాగు ఊపందుకోవడంతో డీఏపీ ఎరువుకు డిమాండ్ పెరిగింది. బస్తా గరిష్ఠ చిల్లర ధర రూ.1350 కాగా ప్రైవేటు వ్యాపారులు రూ.1400 నుంచి రూ.1420కు విక్రయిస్తున్నారు. మిగిలిన కాంప్లెక్స్ ఎరువులతో పోల్చితే డీఏపీ ధర తక్కువగా ఉండడం, దుక్కుల్లో వేయడానికి అనుకూలంగా ఉండడంతో డిమాండ్ ఏర్పడింది. మరోవైపు కారంచేడు మండలంలో రబీ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతులు కొనుగోలు చేస్తున్నారు. మొంథా తుపానుతో దెబ్బతిన్న పంటలు కోలుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో డీఏపీ చల్లుతున్నారు. మిగిలిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచుకోవడానికి కంపెనీలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. డీఏపీ ధరపై నియంత్రణ విధించడంతో తయారీ కంపెనీలు కూడా ఆచితూచి సరఫరా చేస్తున్నాయి. మొంథా తుపాను తర్వాత అందరూ రబీ సీజన్లో ఒకేసారి సాగుకు సిద్ధం కావడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీనికితోడు 70శాతం ఎరువులను మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేసి, 30 శాతం మాత్రమే ప్రైవేటు డీలర్లకు ఇస్తున్నారు. దీంతో ప్రయివేటు మార్కెట్లోనూ లభ్యత తక్కువగా ఉంది. ఇదే అదనుగా వ్యాపారులు లింకు ఉత్పత్తులు కొనుగోలు చేయాలని చెప్పడం, లేనిపక్షంలో బస్తాకు ప్రాంతాన్ని బట్టి రూ.50 నుంచి రూ.70 అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పుగా కొనుగోలు చేసే రైతులకు రూ.100వరకు అదనంగా వేస్తున్నారు.